శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే.
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే..
శ్రీరామ నామం మధురం.. మహానందభరితం.. అటువంటి శ్రీరామునికి అయోధ్యలో మందిర నిర్మాణం జరుగుతోంది. శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర తలపెట్టిన ఈ రామ మందిర నిర్మాణంలో నేను భాగమవుతానంటూ పలువురు ప్రముఖులు విరాళాలను అందజేస్తున్నారు. ప్రముఖులే కాదు.. సామాన్య ప్రజలు సైతం రామ మందిరం నిర్మాణంలో భాగస్వాములవుతూ.. వారికి తోచినంతగా విరాళాలు అందజేస్తున్నారు.
ఇప్పటి వరకు ఎందరో ప్రముఖులు విరాళాలను అందజేశారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రూ. 30 లక్షల రూపాయలను రామ మందిర నిర్మాణానికి విరాళంగా ప్రకటించారు. ఆయనతో పాటు ఆయన కార్యవర్గం కూడా రూ. 11 వేలు విరాళంగా అందజేసినట్లుగా పవన్ కల్యాణ్ తెలిపారు. అలాగే తెలంగాణ గవర్నర్ తమిళ సై ఒక లక్ష ఒక రూపాయిని రామ మందిర నిర్మాణానికి విరాళంగా అందజేశారు. ఇంకా పలువురు బిజేపీ నేతలు విరాళాలు ఇవ్వడమే కాకుండా.. తెలంగాణ రాష్ట్రంలో విరాళాలు సేకరిస్తున్నారు. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ రూ. 10 వేలు విరాళంగా అందజేశారు. ఎంపీ సుజనా తన కుటుంబం తరుపున రూ. 2కోట్ల 2లక్షల 32 వేలు విరాళంగా ఇచ్చారు. కామినేని శ్రీనివాస్ రూ. 5లక్షలు, సీసీఎల్ గ్రూప్ రూ. 6 కోట్ల 39 లక్షలు, సిద్ధార్థ అకాడమీ రూ. 15 లక్షల విరాళం రామ మందిర నిర్మాణానికి ఇచ్చారు. దాదాపు రెండు లక్షల మంది నిధి సమర్పణ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, అంచనాలకు మించి విరాళాలు అందుతున్నాయని రామజన్మ భూమి నిధి అభియాన్ బృంద కన్వీనర్ బందారి రమేష్, కమిటీ అధ్యక్షుడు విద్యాసాగర్ తెలిపారు.