TFJA: తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (టి.ఎఫ్‌జె.) సభ్యులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను మెగాస్టార్ చిరంజీవి ప్రధానం చేశారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రతి ఒక్కరికీ కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినిమాటోగ్రపీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, ఎతికా ఇన్యూరెన్స్ సి.ఇ.ఓ. రాజేంద్ర, టి.ఎఫ్.జె. అధ్యక్షుడు వి లక్ష్మీనారాయణ, జనరల్ సెక్రటరీ వై జె రాంబాబు, కోశాధికారి నాయుడు సురేంద్ర కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, జర్నలిస్టులంటే నా బంధువులతో వున్న ఫీలింగ్ కలుగుతుంది. నా కెరీర్ ఆరంభంలో `ప్రాణం ఖరీదు` సినిమా చేస్తున్నప్పుడు నా గురించి ఎవరైనా రాస్తే బాగుంటుందని ఆనుకుంటున్న తరుణంలో పసుపులేటి రామారావుగారి రాసిన ఆర్టికల్ నన్ను ఎంతో కదిలించింది. వెంటనే ఆయనకు థ్యాంక్స్ చెబుతూ ఏదైనా ఇవ్వాలని వందరూపాయలు ఇస్తే, ఆయన సున్నితంగా తిరస్కరిస్తూ, డబ్బుకోసం రాయలేదు సార్. అది నా బాధ్యత అన్న మాటలు జర్నలిస్టులపై గౌరవాన్ని మరింత పెంచాయి .అలా రామారావుగారిపై గౌరవం ఇటీవలే మరణించినంతవరకు వుంది. అదేవిధంగా నా కెరీర్‌కు తగు సూచనలు, సలహాలు ఇవ్వడమేకాకుండా ఉన్నది ఉన్నట్లు తెలియజేసిన గుడిపూడి శ్రీహరి, వి.ఎస్.ఆర్. ఆంజనేయులు, నందగోపాల్ వంటివారి నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ నన్ను నేను సరిచేసుకునేలా చేశారు. ఈ రోజున ఆ గౌరవంతో టి.ఎఫ్.జె. కమిటీ ఆహ్వానిస్తే వచ్చాను. పాండమిక్ టైంలో 24 క్రాఫ్ట్‌లతోపాటు జర్నలిస్టు సోదరులకు కూడా నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఇక తలసాని శ్రీనివాస యాదవ్‌గారి సూచన మేరకు ప్రతి సినిమాకు లక్షరూపాయలు చొప్పున టి.ఎఫ్.జె. అసోసియేషన్‌కు ఇచ్చేలా నేను ముందుంటాను.. ఈరోజు హెల్గ్ కార్డ్‌లు నాచేతులమీదు జరిగాయి. భవిష్యత్‌లో ఏ అవసరం వచ్చినా మీకు తోడుగా వుంటాను. ఇక ముఖ్యమైన విషయం ఏమంటే, రాష్ట్రం విడిపోయాక ఎటువంటి అవార్డులు సినిమారంగానికి లేవు. అందుకు టి.ఎఫ్.జె. నడుంకట్టి దక్షిణాది పరిశ్రమమొత్తం కలిపేలా సౌత్ ఇండియన్ ఫిలింఫెస్టివల్ అవార్డులు నవంబర్‌లో ఇవ్వాలనుకోవడం శుభపరిణామం.. ఇందుకు ఎల్లవేలలా నా వంతు సహకారం వుంటుందని అన్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ, సినిమా జర్నలిస్టులంటేనే ప్రమోషన్ లో భాగస్వామ్యం అవుతారు. రాజకీయాలు చేయడం వారికి తెలీదు. క్రమశిక్షణతో మెలగడం విశేషం. పాండేమిక్ టైంలో చిరంజీవిగారు చొరవ తీసుకుని జర్నలిస్టులకు చేదోడు వాదోడుగా వున్నారు. అలాగే నేను కూడా వందలాదిమందికి గ్రాసరీస్‌ను అందజేశాను. అలాగే ప్రతి సినిమాకు లక్షరూపాయల చొప్పున టి.ఎఫ్.జె. అసోసియేషన్‌కు ఇస్తే బాగుంటుందని భావిస్తున్నాను. నా వంతు సాయంగా నేను ఐదులక్షలు రేపు అందజేస్తాను. ఇప్పటికే దిల్‌రాజు, అనిల్ రావిపూడి, నిర్మాత రాధాకృష్ణ వంటివారు పలురకాలుగా అసోసియేషన్‌కు అండగా వున్నారు.
అదేవిధంగా ప్రభుత్వపరంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కె.సి.ఆర్. ప్రభుత్వం చేపడుతుంది. సినిమారంగానికి సింగిల్ విండో, 5వ ఆట, రేట్ల విషయంలో వెసులుబాటు వంటి చేసింది. ఇక ఆరోగ్యపరంగా ఆరోగ్యశ్రీ కూడా ప్రవేశపెట్టింది. సినిమా జర్నలిస్టులకు కూడా అందులో వుండేలా చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా అక్రిడేషన్ గురించి కూడా ఐ.ఎన్.పి.ఆర్ .డిపార్టమెంట్‌తో మాట్లాడి వచ్చేలా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, ఏ చరిత్ర అయినా జర్నలిస్టు రాసిన సిరాతోనే మొదలవుతుంది. అందుకే వారంటే గౌరవం. అలాంటి వారికి హెల్త్‌కార్డ్ ఎంతో ఉపయోగపడుతుంది. ఒక యూనిటీ వుండి అసోసియేషన్‌ను ముందుకు నడుపుతున్న కార్యవర్గాన్ని అభినందిస్తున్నాను. సినిమా రంగంలో చిరంజీవి అంటేనే అందరికీ ధైర్యంగా వుంటుంది. జర్నలిస్టుకు ఆ భరోసా ఆయన వల్లే వస్తుంది. ఈ సందర్భంగా ఆచార్య సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు.
ఎతికా ఇన్యూరెన్స్ బ్రొకింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సి.ఓ.ఓ. రాజేంద్ర మాట్లాడుతూ, నాలుగేల్ళనాడు జర్నలిస్టు మిత్రులు వచ్చి సభ్యుల ఆరోగ్యం గురించి అడిగారు. ఇన్యూరెన్స్ కోసం మా వంతు కృషి చేశాం. పలురకాల ఇన్యూరెన్స్‌లు వున్నాయి. ఏది ఏమైనా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఏదైనా అవసరముంటే ఎల్లవేలలా మీకు అందుబాటులో వుంటానని పేర్కొన్నారు.
ముందుగా తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (టి.ఎఫ్‌జె.) ఏర్పాటు గురించి సభ్యులకు అసోసియేషన్ సేవల గురించి అధ్యక్షుడు వి లక్ష్మీనారాయణ వివరించారు.
టి.ఎప్.జె. కోశాధికారి నాయుడు సురేంద్ర మాట్లాడుతూ, ఈ ఏడాది 110 మంది మెడికల్ బెనిఫిట్‌ను పొందారు. ప్రతి ఒక్కిరీ 3లక్షలు పాలసీ వుండనే ధైర్యం కలిగించేలా అసోసయేషన్ చర్యలు తీసుకుంది. ఇటీవలే మరణించిన సభ్యులకు తగువిధంగా 15లక్షలు వచ్చేలా అందజేయడం జరిగింది. ఏది ఏమైనా అందరూ బాగుండాలనే అసోసియేసన్ ముందుకు సాగుతుంది అని చెప్పారు.
అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.జె. రాంబాబు మాట్లాడుతూ, కోవిడ్ టైంలో దర్శకుడు అనిల్ రావిపూడి అసోసియేసన్‌కు సాయం చేశారు. అదేవిధంగా మంత్రి తలసానిగారు ప్రభుత్వంపరంగా జర్నలిస్టులకు ఏదైనా సాయం కావాలన్నా చొరవ చూపాలని విజ్శప్తి చేస్తున్నాం. చిరంజీవిగారు కరోనా టైంలో ఎంతో సహకారాన్ని జర్నలిస్టులకు అందజేశారని గుర్తుచేశారు.
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కొత్తగా ఎన్నికైన బాడీ లిస్ట్
ప్రెసిడెంట్
వి లక్ష్మీనారాయణ
ఉపాధ్యక్షులు
1. ఎం చంద్ర శేఖర్
2. జి శ్రీనివాస్ కుమార్
జనరల్ సెక్రటరీ
వై జె రాంబాబు
జాయింట్ సెక్రటరీలు
1.జి వి రమణ
2. వంశీ కాకా
కోశాధికారి
నాయుడు సురేంద్ర కుమార్
కార్య నిర్వాహక కమిటీ
1. పి రఘు
2. వై రవిచంద్ర
3. జి జలపతి
4. కె ఫణి
5. కె సతీష్
6. రెంటాల జయదేవ్
7. వడ్డి ఓం ప్రకాష్
8. సురేష్ కొండి