Coriander: చాలా మందిని ఎక్కువగా వేధించే సమస్య ఏంటి అంటే పైత్యం. ఇది మనిషిని అన్ని విధాలుగా వేధిస్తూ ఉంటుంది. చాలా మందిలో ఉదయాన్నే ఈ సమస్య ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. ఏం తినాలన్నా, తాగాలన్నా కూడా ఈ పైత్యం వలన తినలేక పోవడం జరుగుతుంటుంది. కడుపు ఉబ్బరంగా ఉండడం, వికారంగా ఉండడం లాంటివి చోటు చేసుకుంటాయి. ఇలాంటి సమస్యలకు మన వంట గదిలో ఉండే ఒక వస్తువుతో ఈ సమస్యని అవలీలగా దూరం చేసుకోవచ్చు.
ఇదే విషయం గురించి ఈ ఇంటి ఇల్లాల్ని అడిగినా ప్రప్రధమంగా చెప్పేది ఈ వస్తువు గురించే. అదే ధనియాలు. ప్రతి ఒక్క ఇంట్లో తప్పనిసరిగా ఉండే వాటిల్లో ఇది ఒకటి. కొందరి ఇళ్లల్లో కొన్ని రకాల వస్తువులు అంటే శొంఠి, ఇంగువ, లవంగాలు లాంటివి ఉండకపోవచ్చు. కానీ ధనియాలు లేని ఇల్లు ఉండదు. ఎందుకంటే ఇవి లేనిదే ఆ ఇంట్లో చారు, కారం పొడి లాంటివి చేయడం కుదరదు కాబట్టి. అంతలా ఈ ధనియాలు ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. ధనియాలు రుచికి కాస్త వగరుగా, కాస్త తియ్యగా ఉంటాయి. ఇవి ఒంట్లో వేడిని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ఇవి పైత్యం, జ్వరం, అతి దప్పికను తగ్గిస్తుంది. దగ్గుని, వంతుల్ని తగ్గించే లక్షణాలు ఇందులో ఉన్నాయి. అటువంటి ధనియాల గురించి, వాటిలో ఉండే ఉపయోగాల గురించి, ఎలా వాడాలో అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
-ధనియాలని నీళ్లు చల్లుతూ మెత్తగా నూరి పిండాలి. అలా వచ్చిన రసంలో పంచదారని కలిపి తీసుకుంటే వాత, పిత్త, శ్లేష్మాలను తగ్గిస్తుంది. అలాగే నోటికి రుచిని తెలియ చేస్తుంది.
– ధనియాల్ని, శొంఠిని తీసుకుని మెత్తగా పొడి చేసి, దీనిని అన్నంలో మొదటి ముద్దగా నెయ్యి వేసుకుని తినాలి. ఇలా చేయడం వలన పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది. అలా తినలేని వారు ఈ రెంటిని కాషాయంలాగా తీసుకున్న కూడా మంచి ఫలితం ఉంటుంది.
– ధనియాల పొడికి పంచదారని కానీ, పాతిక బెల్లం కానీ కలిపి ఈ మిశ్రమాన్ని బియ్యం కడిగిన నీటితో కలిపి చిన్న పిల్లలికి తాగించినట్లైతే దగ్గు, ఆయాసం లాంటివి తగ్గుతాయి.
– ధనియాలు ఒక వంతు, జీలకర్ర రెండు వంతులు తీసుకుని ఈ మొత్తానికి సరిపడినంత బెల్లం కలిపి స్టవ్ మీద బాగా నీళ్లు పోసి ఉడికించాలి. ఇది ఒక హాల్వా టైపులో వచ్చేవరకు ఉడికించి దీనిని ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తీసున్నట్లైతే అధిక రక్తపోటు, పైత్యపు వికారాలు తగ్గుతాయి.
– ధనియాలు, వట్టివేర్లు పొడి చేసుకుని నీళ్లలో వేసి మరిగించి తాగాలి. ఇలా చేయడం వలన అతిసార వ్యాధి (డయేరియా) తగ్గుతుంది.
– ప్రస్తుతం ఉన్న బిజీ పనులతో చాలామందికి నిద్రలేమి అనేది సహజం. అలా నిద్రలేమితో బాధపడే వారికీ ఈ ధనియాలతో మంచి కాషాయం ఉంది. ధనియాల్ని నీళ్లలో వేసి బాగా మరిగించాలి. దీనిని చక్కర కలిపిన పాలలో కలిపి తీసుకుంటే బాగా నిద్ర పడుతుంది.
– కొంతమంది దీర్ఘకాల వ్యాధితో బాధపడి, తగ్గిన తరువాత నోటికి రుచి లేకపోవడం, అజీర్ణం వంటి సమస్యలతో భాధ పడుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ ధనియాలని, ఎండుమిర్చితో కలిపి వేయించి కారంపొడి లాగా చేసి అన్నంతో కలిపి తిన్నట్లైతే అరుచి, అజీర్ణం వంటి సమస్యలు దూరమవుతాయి.
– ధనియాలని నీటిలో వేసి మరిగించి, ఆ నీటికి పంచదార, తేనె కలిపి తాగితే అతి దప్పిక సమస్య తగ్గుతుంది.
– అల్లం రసం, ధనియాలు లేదా కొత్తిమీర రసంతో కలిపి తీసుకుంటే లివర్ (కాలేయం) సంబంధిత వ్యాధులు తగ్గుతాయి.
-ధనియాల పొడిని పంచదార నీటితో కలిపి తాగితే కడుపులో మంట తగ్గుతుంది.
ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్న ధనియాల్ని వాడి వాతం, పైత్యం, అజీర్ణం, కడుపులో మంట వంటి అనేక సమస్యలకి ప్రధమ చికిత్స లాగా వాడుకోవచ్చు.