తెలుగు సినిమా పరిశ్రమలో గత కొన్ని సంవత్సరాలుగా తన నటనా ప్రతిభతో ప్రేక్షకుల మనసులను ఆకర్షిస్తున్నారు శివాజీ. ఇటీవల విడుదలైన ‘కోర్ట్’ సినిమాతో మరోసారి తన నటనా సత్తాను చాటాడు.. నాని నిర్మాతగా, ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటి ఇటీవలే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
‘కోర్ట్’ సినిమాలో శివాజీ పాత్ర అత్యంత కీలకమైనది కాగా, ఆయన నటనలోని సహజత్వం, భావోద్వేగ ప్రదర్శన ప్రేక్షకులను కట్టిపడేసింది. ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. శివాజీ నటనకు నెటిజన్లు ఫిదా అవుతూ, ఆయన పాత్రను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు.
తాజాగా, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరుగాంచిన సుకుమార్ కూడా ‘కోర్ట్’ సినిమాను వీక్షించి, శివాజీ నటనకు ఫిదా అయ్యారు. సుకుమార్ శివాజీని, ఆయన నటన గురించి ప్రత్యేకంగా అభినందించారు. నిన్న సాయంత్రం వీరిద్దరూ కలిసి కొంత సమయం గడిపారు. ఈ సమావేశంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
కోర్ట్’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన శివాజీ, ప్రస్తుతం బిజీ షెడ్యూల్‌తో ఉన్నారు. ఆయన ‘దండోరా’ అనే సినిమాలో నటిస్తున్నారు. అంతేకాకుండా, తన సొంత నిర్మాణంలో తాను హీరోగా లయ హీరోయిన్‌గా ఒక సినిమాను కూడా రూపొందిస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా రెండు విభాగాల్లోనూ తన ప్రతిభను చాటుకోవడం శివాజీ విశేషం.