CM launches new scheme: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పశ్చిమ బెంగాల్ రాజకీయ యవనిక వేడెక్కుతోంది. అధికార విపక్షాలు అన్నీ పోటాపోటీగా హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కొత్త పథకాన్ని లాంచ్ చేశారు. ‘మా కిచెన్లు’ పేరుతో ప్రకటించిన ఈ స్కీం ప్రకారం, పేదలకు కేవలం రూ.5కే ఆహారం అందిస్తారు. ఇలా అందించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందని, అయినా సరే ప్రతి ప్లేటు మీదా రూ.15ల సబ్సిడీని ప్రభుత్వమే భరిస్తుందని దీదీ స్పష్టం చేశారు. స్వచ్ఛంద సంస్థలుప్రతి రోజూ మధ్యాహ్నం 1 నుంచి 3గంటల మధ్య వంట పనులు చూస్తాయట. అన్నం, ఓ వెజిటెబుల్ కూర, ఎగ్ కర్రీ అందిస్తారట.
ఈ ‘మా కిచెన్లు’ను మమత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. ”బెంగాల్‌లో సిటీలు, టౌన్‌లలో ప్రస్తుతం పరిమిత సంఖ్యలో ‘మా కిచెన్లు’ ప్రారంభిస్తున్నాం. త్వరలోనే వీటి సంఖ్యను మరింత పెంచుతాం. ఈ పథకం లబ్ధి దారులు కేవలం 5 రూపాయలతో భోజనం చేయవచ్చు. ఈ మీల్స్ ప్రతి ప్లేటుపై 15 రూపాయల సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం నుంచే వస్తుంది. మా కిచెన్ సెంటర్లతో చాలా మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయి” అని సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. అలాగే సాల్ట్ లేక్ వద్ద ఐటీ పార్క్ సహా పలు ప్రాజెక్టులను కూడా ముఖ్య మంత్రి మమత ప్రారంభించారు.
రాష్ట్రంలో కేన్సర్ పేషంట్ల గుర్తింపు, చికిత్స, రిజిస్ట్రేషన్ కోసం ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ కూడా మమత చేతుల మీదుగా ప్రారంభం అయింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 294 అసెంబ్లీ స్థానాలకు గాను ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలు చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఉనికి కోల్పోయే ప్రమాదంలో ఉన్న కాంగ్రెస్ కూడా పశ్చిమ బెంగాల్‌లో గట్టి పోటీ ఇచ్చి తన పరువు నిలుపుకోవాలని చూస్తోంది.