హీరో సందీప్ కిషన్ నిర్మాతగా కమెడియన్ సత్యని హీరోగా పరిచయం చేస్తున్న చిత్రం ‘వివాహ భోజనంబు’. హాస్య నటుడు సత్య కథానాయకుడిగా నటించిన తొలి సినిమా ఇది. అర్జావీ రాజ్ హీరోయిన్. ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కె.ఎస్. శినీష్, సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. నెల్లూరు ప్రభ అనే ప్రత్యేక పాత్రలో ప్రముఖ యువ హీరో సందీప్ కిషన్ నటించారు. ఈ చిత్రంలోని తొలి పాట ‘ఎబిసిడి… నువ్వు నా జోడీ’ని తాజాగా విడుదల చేశారు.
అనిరుద్ విజయ్ (అనివీ) కంపోజ్ చేసిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు. ఇన్నో గెంగా ఆలపించారు. రోల్ రైడా ర్యాప్ పాడారు. కాలేజీ నేపథ్యంలో మొదలైన ఈ పాట కొంత ముందుకు వెళ్లేసరికి సత్య వేసిన స్టెప్పులు అందర్నీ ఆకర్షించాయి. సినిమాలో తనకు ఇష్టమైన పాట ‘ఎబిసిడి…’ అని హీరో, ఈ చిత్రానికి అయిన సందీప్ కిషన్ చెప్పారు. లాక్‌డౌన్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ప్రేరణతో రూపొందిన చిత్రమిది.
కథ విషయానికి వస్తే.. 10 రూపాయలు పార్కింగ్ టికెట్ కొనడానికి, స్నేహితులకు పుట్టినరోజు పార్టీ ఇవ్వడానికి ఇష్టపడని ఓ పిసినారి మహేష్ (సత్య), కరోనా పుణ్యమా అని లాక్‌డౌన్ రావడంతో 30మందితో సింపుల్‌గా పెళ్లి తంతు కానిచ్చేస్తాడు. కానీ, ఆ తరవాత అసలు కథ మొదలవుతుంది. లాక్‌డౌన్ పొడిగించడంతో పిసినారి మహేష్ ఎన్ని కష్టాలు పడ్డాడనేది తెరపై చూడాలని చిత్రబృందం చెబుతోంది. సందీప్ కిషన్ పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనీ, కథానాయకుడిగా సత్య అద్భుతంగా నటించాడనీ యూనిట్ వర్గాలు తెలిపాయి.