ఇటీవలే ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ తీసుకొచ్చింది. దీనిపై ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేగుతోంది. ఈ పాలసీని చూసిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా సిగ్నల్ యాప్ వాడాలని ఓ ట్వీట్ చేశాడు. దీంతో చాలా మంది వాట్సాప్ యూజర్లు సిగ్నల్ బాట పట్టారు. తమ వాట్సాప్ ఖాతాలను డిలీట్ చేసేస్తున్నారు. దీనిపై వాట్సాప్ వివరణ ఇచ్చినా ఫలితం లేకపోయింది. అంత వివరణ ఎందుకు? ఈ నిబంధనలతో సాధారణ యూజర్ల డేటా సేకరించబోమని చెప్పినప్పుడు అసలు ఈ పాలసీ ఎందుకు తీసుకురావడం? అని వినియోగ దారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై తాజాగా ఓ సంస్థ చేసిన సర్వేలో కూడా ఇదే విషయం వెల్లడి అయ్యింది. నూటికి 50 శాతం మంది వాట్సాప్ యూజర్లు కొత్త పాలసీపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సదరు సర్వే తెలిపింది.
వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీపై చాలా మంది యూజర్లు చిర్రెత్తి పోయి ఉన్నారు. తమ డేటా అంతా తీసుకెళ్లి వాట్సాప్ పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్‌కు ఇవ్వాల్సి ఉంటుందని ఈ పాలసీలో వాట్సాప్ స్పష్టం చేసింది. ఈ పాలసీపై యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేవలం బిజినెస్ ఖాతాల వివరాలు మాత్రమే ఫేస్‌బుక్ తో పంచుకుంటామని, సాధారణ యూజర్ల డేటా సురక్షితమేనని వివరణ ఇచ్చింది.
అయినా కూడా చాలా మంది యూజర్లు సంతృప్తి చెందలేదు. వాట్సాప్ వదిలి సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ఇతర యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవడానికి రెడీ అయిపోయారు. ఈ సమయంలో వాట్సాప్ అకౌంట్‌ను, మన చాట్ హిస్టరీని డిలీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇలా గనుక చేయాలనుకుంటే ముందుగా సర్వర్లలోని మెసేజ్‌లన్నీ డిలీట్ చేయడం ఉత్తమం. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
బ్యాకప్ మెసేజ్‌లను డిలీట్ చేసే విధానం:
వాట్సాప్ బ్యాకప్ మెసేజ్‌లను కూడా మనమే డిలీట్ చేయవచ్చు. మన చాట్ హిస్టరీకి సంబంధించిన బ్యాకప్ ఫైల్స్ అన్నీ కూడా /sdcard/WhatsApp/Databases/folder అనే ఫోల్డర్ లో సేవ్ అవుతాయని వాట్సాప్ చెప్తోంది. ఇక్కడ ఉన్న డేటా మొత్తాన్ని ముందుగా డిలీట్ చేసేసి ఆ తర్వాత వాట్సాప్ ఖాతాను డిలీట్ చేసుకుంటే మన డేటా వాట్సాప్ దగ్గర ఉండదట.