IPL auction: ప్రపంచ క్రికెట్ అభిమానులతో పాటు, ప్లేయర్లందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూసే క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్. దీని కోసం చాలా దేశాల క్రికెట్ బోర్డులు తమ షెడ్యూల్ ఖాళీ చేసుకుంటాయనే సంగతి తెలుసు కదా. ఇంత ప్రఖ్యాతిగాంచిన ఐపీఎల్‌లో ఫిక్సింగ్ చేసి నిషేధానికి గురైన భారత పేసర్ శ్రీశాంత్ గుర్తున్నాడా? ఇదిగో ఇన్నేళ్ల తర్వాత బీసీసీఐ నిషేధం తొలగించినా అతని పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు.
2021లో జరగబోయే ఐపీఎల్‌లో అతను కచ్చితంగా ఆడతాడని చాలా మంది భావించారు. అయితే ఈ లీగ్ వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాలో శ్రీశాంత్ పేరు లేదు. ఇలా ఐపీఎల్ జాబితాలో తన పేరు లేకపోవడంపై ఈ కేరళ స్పీడ్‌స్టర్ పెదవి విప్పాడు. ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది అయినా ఐపీఎల్ ఆడతానని శ్రీశాంత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 14 ఆడాలని శ్రీశాంత్ చాలా తహతహలాడాడు. దీని కోసమే లీగ్ వేలంలో తన పేరును కూడా నమోదు చేసుకున్నాడు. తన బేస్ ధరగా 75 లక్షల రూపాయలు ఆశించాడు. అయితే చివరి నిమిషంలో శ్రీశాంత్‌కు బీసీసీఐ నుంచి భారీ షాక్ తగిలింది. తుది జాబితాలో అతడి పేరు లేకుండా చేసింది.
ఫ్రాంచైజీలు ఏవీ శ్రీశాంత్‌పై పెద్దగా ఆసక్తి చూపలేదని, అందుకే అతడి పేరును నమోదు చేయలేదని బీసీసీఐ పేర్కొంది. దీనిపై స్పందించిన శ్రీశాంత్.. ఈ ఏడాది ఐపీఎల్ ఆడలేక పోతున్నందుకు తాను బాధపడడం లేదని చెప్పాడు. అయితే వచ్చే ఏడాది ఆడతాననే నమ్మకం ఉందని, ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటానని వెల్లడించాడు. మళ్లీ ఇలా క్రికెట్ ఆడటం కోసం 8 ఏళ్లు ఎదురు చూశానని, మరో ఏడాది ఎదురు చూడటం పెద్ద శ్రమ కాదని శ్రీశాంత్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఏడాది ఐపీఎల్ ఎప్పటిలానే మార్చిలో ప్రారంభమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.