క్రమపాఠీలు, ఘనపాఠీలు, సలక్షణ ఘనపాఠీలు… ఇలా ఎందరో వేదనిధుల్లాంటి వందకు పైగా వివిధ ఆలయాల, వివిధ వేద పాఠశాలల వేదపండితులు రవీంద్ర భారతిలో చేసిన వేదగానంతో ఆ ప్రాంతమంతా పవిత్రంగా ప్రతిధ్వనించడం ఒక అద్భుతమైతే.. ఈ శ్రీ కార్యంలో ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనా సంకలనాలు ‘దేవీం స్మరామి’, ‘ఆనంద నిలయం’ రెండింటినీ ప్రసన్న మూర్తులైన తేజశ్శాలి, తరతరాల సంప్రదాయ సంస్కృతీ పరిరక్షణ పీఠమైన పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీ శంకరభారతీ నృసింహ స్వామి ఆవిష్కరించడం మరొక అత్యద్భుత ఘట్టంగా చెప్పక తప్పదు.
జంట నగరాలలోనే కాకుండా విదేశాలలోసైతం ఎంతో పేరు ప్రతిష్టలున్న అజాత శత్రువు, సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కె. వి. రమణాచారి అధ్యక్ష స్థానంలో సమర్ధవంతంగా, సంప్రదాయ విలువలమధ్య సుమారు రెండు గంటలపాటు నడిచిన ఈ మహోత్తమ కార్యం ప్రముఖ సాంస్కృతిక పారమార్ధిక సంస్థ ‘సత్కళా భారతి’ సంస్థాపకులు సత్యనారాయణ పర్యవేక్షణలో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ సంబరంగా జరగడం ఒక ప్రాధాన్యతగా నగర పండితలోకం బాహాటంగా చెప్పుకోవడం గమనార్హం. వేద ధ్వనులతో రవీంద్ర భారతిని తన్మయింప చేసిన వేదపండితులందఱకు ప్రముఖ వస్త్ర వ్యాపారసంస్థ ఆర్‌ఎస్ బ్రదర్స్ అధినేతలు ఎస్. రాజమౌళి, వెంకటేశ్వర్లు పురాణపండ శ్రీనివాస్ లావణ్య భరితమైన గ్రంధాలను, నూతన వస్త్రాలతో కొంత నగదును బహుకరించారు.
కొందరు వేదపండితులకు బుక్స్ అందకపోవడంతో నిర్వాహకులను అడగగా.. ఎక్కువ స్పందన రావడంతో కొందరు పండితులు నాలుగైదు సెట్లు చొప్పున పురాణపండ బుక్స్‌ని ఎంతో ఆసక్తితో అడిగిమరీ తీసుకున్నారని చెప్పడం.. ఈ పవిత్ర కార్యంలో ఈ చక్కని పుస్తకాలు అందడానికి ప్రధాన సూత్రధారైన రమణాచారికి అందరూ ధన్యవాదాలు తెలిపారు.
ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణవేదాలను విడి విదిహా ఎంతో శ్రావణ సుభగంగా గానం చేసిన పండిత బృందాలకు పుష్పగిరి పీఠాధిపతి ఎంతో భక్తిమయంగా ఆప్యాయతతో మంగళాశాసనాలు చేశారు. పురాణపండ శ్రీనివాస్ అమోఘ గ్రంధాలను ఆసక్తిగా పరిశీలించి అభినందించారు. కార్యక్రమం ఆద్యంతం రమణాచారి నడిపించిన తీరు ఎంతో సంప్రదాయబద్ధంగా, పూజ్యభావంతో సాగడం విశేషం. ఈ కార్యక్రమంలో అతిధిగా తెలంగాణ పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి దోమోదర్ గుప్తా పాల్గొని ఇలాంటి మహత్తర కార్యంలో పాలుపంచుకునే భాగ్యం నాకు కలగడం ఎన్ని జన్మల పుణ్యమో అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రముఖ సినీ నిర్మాత వివేక్ కూచిభొట్ల, ప్రముఖ పారిశ్రామికవేత్త వేదుల సుదర్శన్ రావుల సమర్పణలో ఈ ఆనంద నిలయం, దేవీం స్మరామి గ్రంధాలు ప్రచురించబడ్డాయని, సౌజన్య సహకారం అందించిన ఆర్ బ్రదర్స్ అధినేతలు రాజమౌళి, వెంకటేశ్వర్లులను నిర్వాహకులు ప్రశంసలతో ముంచెత్తారు.