కాకినాడ, అక్టోబర్ 6: పరమవరేణ్యురాలైన కనకదుర్గమ్మకు కమనీయంగా, రమణీయంగా జరిగే శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాల పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం దేవీచౌక్ అమ్మవారిని ఈ దసరా ఉత్సవాల్లో దర్శించుకునే, అర్చించుకునే వేలకొలది భక్తులకు ఈసారి ఒక అపురూప పవిత్రకానుకను సమర్పిస్తున్నారు. అరిష్టశక్తులమీద విజయంగా ప్రముఖ రచయిత, శ్రీశైలదేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనంగా అద్భుతంగా రూపొందించిన ‘సౌభాగ్య’ వర్ణమయ గ్రంధం ఈసారి భక్తజన సందోహాన్ని తన్మయింపజేస్తోంది.
అమ్మవారి అనుగ్రహంతో అందరినీ సమృద్ధం చేయడానికి సాధకుల నుండి సామాన్యులవరకూ ఆకట్టుకునేలా నాణ్యతా ప్రమాణాలతో ముద్రించబడిన ఈ ‘సౌభాగ్య’ మంగళమయ గ్రంధంలో సుమారు ఇరవై ఐదు పవిత్ర అంశాలు చోటు చేసుకోవడం విశేషం. గత నాలుగు సంవత్సరాలుగా బెజవాడ కనకదుర్గమ్మకు ప్రతీ శ్రీ దుర్గానవరాత్రోత్సవాల సందర్భంగా ఒక పవిత్ర ప్రత్యేక గ్రంధాన్ని అందిస్తున్న జ్ఞానమహాయజ్ఞ కేంద్రం సంస్థ ఈ సంవత్సరం ప్రత్యేకంగా దేవీచౌక్ ఉత్సవాలకు ఈ మంత్ర సంపదను సిద్ధం చేయడంతో అర్చక పండితుల అభినందలు వెల్లువెత్తుతున్నాయి. భక్త కోటికి ఉచితంగా అందించే ఈ మహత్వ శక్తుల ‘సౌభాగ్య’ గ్రంధాన్ని ఉత్సవాల తొలిరోజైన గురువారం పాడ్యమి సందర్భంగా దేవీచౌక్ ఉత్సవ కమిటి అధ్యక్షులు బత్తుల రాజరాజేశ్వరరావు ప్రోత్సాహంతో ఉత్సవ ప్రధాన పురోహితులు దొంతంశెట్టి కాళహస్తీశ్వరరావు అమ్మవారి ముందు ఈ సౌభాగ్య గ్రంధానికి అర్చన చెయ్యడం విశేషం.
దశాబ్దాలుగా కోస్తాజిల్లాల్లో అత్యంత వైభవంగా, పరమ ప్రతిష్టాకరంగా జరిగే దేవీచౌక్ శ్రీ దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో ఈసారి ముత్తయిదువులకు కుంకుమార్చనల్లో ఈ ‘సౌభాగ్య’ గ్రంధాన్ని నిర్వాహకులలో ఉత్సాహవంతమైన పాత్ర వహిస్తున్న మల్లేశ్వరరావు ఉచితంగా అందజేస్తున్నారు. శ్రీ జ్ఞానసరస్వతీ ఆలయ ట్రస్ట్ చైర్మన్ తోటసుబ్బారావు, స్టాండర్డ్ ఎలెక్ట్రానిక్స్ డైరెక్టర్ చెన్నాప్రగడ శ్రీనివాస్ (బాబు) ఈ సౌభాగ్య గ్రంధానికి సమర్పకులుగా వ్యవహరించడాన్ని భక్త కోటి హర్షిస్తోంది. ఈ సందర్భంలో చిరంజీవి ఎన్.అఖిల్ దేవీ చౌక్ దుర్గమ్మ తల్లికి ఒక కుంకుమ బస్తాను ప్రధాన అర్చకుని ద్వారా సమర్పించి అమ్మవారి అనుగ్రహం పొందారు.
శ్రీమాలిక, శ్రీపూర్ణిమ, మహాసౌందర్యం, యుగే యుగే, మహా మంత్రస్య, పచ్చకర్పూరం.. వంటి ఎన్నో మహాద్భుత గ్రంధసంపదతో గోదావరి జిల్లాల ఘనకీర్తిని దేశదేశాల తెలుగువారి హృదయాలపై జయకేతంగా ఎగురవేసిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అపురూప అద్భుత సంకలనం కావడంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంతోందని విజ్ఞులు అభినందనలు వర్షిస్తున్నారు. ఇదిలా ఉండగా కాకినాడలో లక్షలాదిమంది ఇలవేల్పుగా కొలుచుకునే శ్రీ బాలాత్రిపురసుందరీ దేవాలయం ప్రత్యేకార్చనల్లో పురాణపండ శ్రీనివాస్ ‘శ్రీ సహస్ర’ గ్రంధం అందరినీ అలరిస్తోంది. అత్యధికులు పురాణపండ శ్రీనివాస్ గ్రంధాన్ని వినియోగించడం ఆశ్చర్యకరం. ఈ అపురూప గ్రంధాల్లో అతి అరుదైన వర్ణమయ చిత్రాలు, శ్రీనివాస్ వ్యాఖ్యాన భాషా సౌందర్యాల సొగసులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయని ఆయా అర్చక పండితులు పేర్కొనడం గమనార్హం.