ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఇప్పుడున్న బిజీ బిజీ జీవితంలో సగటు మనిషి తన ఆరోగ్యాన్ని సరిగా పట్టించుకోవడమే మానేశాడు. కానీ గత కొన్ని నెలలుగా ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. అందుకు కారణం ఓ మహమ్మారి విలయ తాండవం. ఆ మహమ్మారి వలన ప్రతి ఒక్కరు చిన్న చిన్న చిట్కాలను పాటిస్తూ తమ ఆరోగ్యం విషయంలో ఎంతో అప్రమత్తతో ఉంటున్నారు. మన ఇంట్లో, పెరట్లో ఉండే ప్రతి చెట్టు, వస్తువు మనకి ఎంతో మేలు చేస్తాయో తెలుసుకునే పనిలో ఉన్నారు. ఇలా ఇంటిలో ఉండి మేలు చేసే వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తులసి మొక్క గురించే.
ఈ తులసి మొక్క ప్రతి ఒక్కరి ఇంటిలోనూ ఉంటుంది. పూజ కోసం మాత్రమే ఈ మొక్క ఉపయోగపడుతుంది అనుకుంటారు చాలామంది. కానీ ఈ మొక్క వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వాటిల్లో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- కాలం మారిన ప్రతి సారి జలుబు, దగ్గు లాంటివి సర్వసాధారణం. అలాంటప్పుడు వెంటనే డాక్టర్ ని సంప్రదిస్తూ ఉంటాము. అలా కాకుండా ఈసారి ఇలా చేసి చూడండి. కొన్ని తులసి ఆకుల రసం తీసుకొని, అందులో ఒక స్పూన్ తేనెను కలిపి రోజు తీసుకుంటున్నట్లైతే జలుబు, దగ్గు నాలుగు రోజుల్లో తగ్గడమే కాకుండా… డాక్టర్‌తో అవసరమే ఉండదు. ఈ చిట్కాని సంవత్సరం పిల్లల నుంచి ఎవరైనా తీసుకోవచ్చు.
- కడుపు నొప్పికి కూడా ఈ తులసి ఆకులని వాడవచ్చు. ఒక స్పూన్ తులసి ఆకుల రసం, అల్లం రసం ఒక స్పూన్ కలిపి వేడి చేసి… అందులో తేనె కలిపి రోజుకు మూడు సార్లు తీసుకున్నట్లైతే కడుపు నొప్పి తగ్గు ముఖం పడుతుంది.
- తులసి రసం 4 లేదా 5 చుక్కలు, హాఫ్ టీ స్పూన్ వెల్లుల్లిరసంలో కలిసి రోజూ చెవిలో వేస్తూ.. చెవి నొప్పికి ఉపశమనం లభిస్తుంది.
- అల్లం ముక్కకు కొన్ని తులసి ఆకులు జోడించి ముద్దగా చేసుకుని, అందులో ఒక టీ స్ఫూను తేనె కలిపి తినాలి, తరువాత శొంఠి, తులసి కలిపి ముద్దగా నూరి నుదిటికి పట్టిలాగా వేసుకుని పడుకోవాలి. ఇలా చేస్తే జ్వరం త్వరగా జారుతుంది.
ఇంకా ఎన్నో ప్రయోజనాలు, ఔషధ గుణాలున్న ఈ తులసి మొక్కని ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో పెంచుకుంటే.. దాదాపు సగం జబ్బులను ఇంట్లో నుంచే నయం చేసుకోవచ్చు.