టిక్ టాక్ గురించి తెలియని వారుండరు. చిన్న పెద్ద, రంగు రూపం, భాష తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ టిక్ టాక్ లో భాగస్వాములే. ఓ రెండు నిముషాలు ఒక వీడియో చేసి టిక్ టాక్ లో పోస్ట్ చేస్తే చాలు పాపులారిటీ అనేది ఇట్టే వచ్చేస్తుంది. అంతలా ప్రజల్లోకి చొచ్చుకుపోయింది ఈ టిక్ టాక్. సెలబ్రిటీలు కావాలంటే ఓ రెండు మూడు సినిమాలు బాగా హిట్ అవ్వాలి. అదే టిక్ టాక్ లో ఓ పోస్ట్ పెడితే చాలు, అది కూడా ఓ మంచి థీమ్ ఉంటే చాలు సెలబ్రిటీలైపోతారు. ఒక్క పాట అందలం ఎక్కించేస్తుంది. దీనికి వయసుతో సంభందం లేదని చెప్పుకున్నాం కదా.. ఇప్పుడు ఒక బామ్మ ఈ టిక్ టాక్ ద్వారా సెలేబ్రిటిగా మారిన వైనం తెలుసుకుందాం.
జర్మనీలో నివసిస్తున్న ఎరికా రిష్కో అనే 81 ఏళ్ల బామ్మ 18 ఏళ్ల అమ్మాయిలా మారి లాక్ డౌన్ సమయంలో టిక్ టాక్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. అది కూడా సాదా సీదా వీడియో కాదండోయ్. టీనేజ్ వాళ్ళకి దిమ్మ తిరిగి పోయేలా కసరత్తులు చేస్తున్న వీడియో అది. ఆ ఒక్క వీడియోతో బామ్మ పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఓ 100 వీడియోలు పోస్ట్ చేసింది. కేవలం కసరత్తులే కాదు డాన్స్, ఫన్నీ వీడియోలు చేస్తూ.. వాటిని చూస్తున్న వారిని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడుతుంది. దీనితో ఆమెకి ఉన్న ఫాలోవర్స్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు. అక్షరాలా 1.25 లక్షలు. చూసారుగా టాలెంట్ ఉంటే సరిపోదు దానిని వ్యక్త పరచే తెగింపు కూడా ఉండాలి. అచ్చు ఈ బామ్మలా.