రసవత్తరంగా సాగుతున్న ఆ క్రికెట్ మ్యాచ్.. ఉన్నట్లుండి విషాదాంతం అయింది. మ్యాచ్ ఎవరు గెలుస్తారా? అని అందరూ ఉత్కంఠగా చూడాల్సింది పోయి.. అందరి హృదయాల్లోనూ ఓ అగాధాన్ని మిగిల్చింది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో నిలబడి ఉన్న బ్యాట్స్‌మెన్ సడెన్‌గా కుప్పకూలి పోయాడు. ఏమైందని ఆందోళన చెందిన మిగతా ఆటగాళ్లకు ఏం జరిగిందో అర్థమయ్యేలోపే అతడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. క్రీడాభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ ఘటన పూణేలో జరిగింది. ఇక్కడి జున్నార్ మండలంలో జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్‌లో ఈ విషాద ఘటన జరిగింది. ఇక్కడ మ్యాచ్ జరుగుతుండగా అలా కింద కూర్చున్న బ్యాట్స్‌మెన్.. ఉన్నట్లుండి వెనక్కు పడిపోయాడు. అంపైర్ చూసి ఆందోళనగా డాక్టర్లను పిలిచాడు. కానీ సదరు బ్యాట్స్‌మెన్ అప్పటికే ప్రాణాలు వదిలేశాడు. అతని పేరు బాబూ నలవాడే అని తెలుస్తోంది.
ఈ సమయంలోనే బౌలర్ బంతి వేయగా బ్యాటింగ్ చేస్తున్న బ్యాట్స్‌మన్ భారీ షాట్ కోసం ప్రయత్నించాడు. కానీ ఫెయిల్ అయ్యాడు. దీంతో బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అదే సమయంలో నాన్ స్ట్రైకర్ వైపు ఉన్న నలవాడే పరుగు తీయడానికి ముందుకు వచ్చాడు. కానీ బ్యాట్స్‌మెన్ విఫలం అవ్వడాన్ని చూసి వెనుదిరిగాడు. కీపర్ నుంచి బంతి అందుకున్న బౌలర్.. బంతి వేయడానికి మళ్లీ తన పొజిషన్‌కు వెళ్తున్నాడు. ఆ సమయంలో అంపైర్‌తో ఏదో మాట్లాడిన నలవాడే.. వెళ్లి మళ్లీ తన స్థానంలో నిలబడ్డాడు. అంతలోనే ఏదో ఇబ్బంది ఉన్నట్లు బ్యాట్ పట్టుకొని మోకాళ్లపై కూర్చున్నాడు. క్షణం కూడా గడవక ముందే సడెన్‌గా వెనక్కి పడిపోయాడు. అతడిని అలా చూసి ఆందోళన చెందిన అంపైర్.. వెంటనే స్పందించి మెడికల్ సిబ్బందికి సమాచారం అందజేశాడు. మెడికల్ టీమ్ వెంటనే అక్కడకు వచ్చి నలవాడేను పరీక్షించింది. కానీ ఫలితం లేకపోయింది. అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు తేల్చారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.