CM Jagan appreciates CS: ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌ను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. తాడేపల్లిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో నవరత్నాలు, ప్రభుత్వ పథకాల అమలుపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో పాటు అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఇప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అభినందిస్తున్నానని తెలిపారు.
‘నిజానికి ఇలాంటి సమావేశాలు తరుచూ జరగాల్సి ఉంది. ఎందుకంటే వివిధ శాఖల మధ్య మరింత సమన్వయం ఏర్పడుతుంది. అంతే కాకుండా పలు అంశాలను నేనే స్వయంగా పరిశీలించి, ఎక్కడైనా సమస్యలు గుర్తిస్తే వాటి పరిష్కారానికి ఆదేశాలు చేయగలుగుతాను. ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యల పరిష్కారానికి ఆ శాఖ కార్యదర్శికి తగిన నిర్దేశాలు ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ ఒక వైపు కాగా, మరొక వైపు ఇలాంటి సమావేశాలు మన ముందున్న పనులు, లక్ష్యాలపై మరోసారి దృష్టి పెట్టే వీలు కలుగుతుంది. అందువల్ల ఎక్కడైనా సమాచార లోపం ఉంటే, వెంటనే దాన్ని అధిగమించవచ్చు. ఒకరి ఆలోచనలను మరొకరితో పంచుకోవచ్చు. తద్వారా ఏ సమస్యలు ఉన్నా పరిష్కరించుకోవచ్చు’ అని జగన్ తెలిపారు.
నిస్సంకోచంగా చెప్పండి..
‘ఇక్కడ వివిధ శాఖలకు చెందిన ఎందరో అధికారులు ఉన్నారు. సుపరిపాలన అందించడంలో వారందరికీ ఎంతో అనుభవం ఉంది. అందువల్ల మీ శాఖకు సంబంధించిన అంశం కాకపోయినా సరే, ఫలానా శాఖలో ఫలానా మార్పు చేస్తే ఇంకా సుపరిపాలన అందుతుంది అని మీరు భావిస్తే, ఏ మాత్రం సంకోచించకుండా ముందుకు రండి. స్పష్టంగా మీ అభిప్రాయం తెలియజేయండి. నిస్సందేహంగా మీ సలహాలు అందజేయండి. ఒక మంచి ఆలోచనను ఒక స్పష్టమైన స్ఫూర్తి, నిబద్ధతతో అమలు చేస్తేనే సత్ఫలితాలు వస్తాయి. కాబట్టి మీమీ ఆలోచనలను మీ వరకు పరిమితం చేసుకోకుండా, నిస్సంకోచంగా ముందుకు రండి. సుపరిపాలన కోసం మీమీ అభిప్రాయాలు తెలియజేయండి. సూచనలు ఇవ్వండి. వాటి అమలులో ప్రభుత్వం కూడా సంకోచించదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సుపరిపాలననే కోరుకుంటున్నారు. ఇవీ ముఖ్యమైన అంశాలు’ అని జగన్ చెప్పుకొచ్చారు.