Thinnest building: ఇళ్లు కట్టుకోవాలని ఆలోచన వస్తే చాలు.. ‘లంకంత కొంప’ కట్టుకోవాలని పాతరోజుల్లో పెద్దవాళ్లు తమ సంతానానికి చెప్పేవారు. కానీ ప్రస్తుత మోడ్రన్ యుగంలో ఇలా లంకంత కొంపలు కనిపించడం చాలా అరుదు. మరీ ముఖ్యంగా సిటీల్లో అయితే.. ఎటు చూసినా అన్నీ అపార్టుమెంటులే దర్శనం ఇస్తాయి. ఖాళీ స్థలం కనిపించిందంటే చాలు.. అక్కడే ఓ పది అంతస్థులు లేపేయాలని బిల్డర్లు ప్లాన్లు వేసేస్తారు. ఇప్పుడు ఈ సిటీ మోడల్‌ను కూడా మించి పోయిన ఓ ఇంటి గురించి మాట్లాడుకుందామా?
రెండు భవనాల మధ్య ఇరుక్కుపోయినట్లు ఉండే ఈ ఇల్లు మామూలుగా మనకు కనిపించడం కూడా కష్టమే. ఆ దారిన వెళ్లే సమయంలో చాలా జాగ్రత్తగా గమనిస్తేగానీ అక్కడ ఆ భవంతి ఉన్నట్లు కూడా కనిపించదు. ఈ వింత భవనం ఉంది బ్రిటన్ రాజధాని లండన్‌లో. ఇలా మరీ సన్నగా ఉన్న ఈ భవనం ప్రస్తుతం అమ్మకానికి వచ్చింది!
ఇంత బక్కగా ఉన్న ఈ భవనాన్ని ఎవరు కొంటారు? అని అనుమానం రావడం సహజమే కానీ, ప్రపంచం మాత్రం దీనిపై చాలా ఆసక్తి చూపిస్తోంది. లండన్‌లో అత్యంత సన్నగా ఉండే ఈ బంగళా మార్కెట్ ధర తెలిస్తే ఎవరైనా షాకవ్వాల్సిందే. ఎందుకంటే ఇది మార్కెట్లో దాదాపు రూ. 11 కోట్ల రేటు పలుకుతోంది.
19వ శతాబ్దం చివర్లో ఈ బంగళాను నిర్మించడం జరిగిందట. పొడవు సాధారణంగానే ఉన్న దీని వెడల్పు మాత్రం కేవలం 5 అడుగుల ఏడు అంగుళాలే. ఈ భవనం కట్టిన కొత్తలో ఇందులో టోపీలు అమ్మే ఓ దుకాణం ఉండేది. ఇందులో ఓ కుటుంబం ఉండటానికి, ముడిసరుకు నిల్వ చేసుకోవడానికి కొంత స్థలం కూడా కేటాయించారు.
ఇదిగో ఇన్నాళ్లకు బ్రిటన్‌కు చెందిన రియల ఎస్టేట్ సంస్థ ‘వింక్ వర్త్ ఎస్టేట్’ ఈ బక్క భవనాన్ని అమ్మకానికి పెట్టింది. ఈ క్రమంలోనే దీని ధరను 1.3 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీ లెక్కల్లో దాదాపు 11 కోట్ల రూపాయలుగా నిర్ణయించింది. ఇంత బక్క బంగళాకు అంత భారీ రేటు ఏంటని ప్రశ్నిస్తే మాత్రం.. ఈ బంగళా ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని తాము ఈ ధర నిర్ణయించామని, ఇది కచ్చితంగా సబబైన ధరేనని వింక్‌వర్త్ కంపెనీ బల్లగుద్ది మరీ వాదిస్తోంది.
లండన్ చరిత్రలో ఈ భవనానికి ప్రత్యేక స్థానం ఉందని ఆ సంస్థ అసిస్టెంట్ మేనేజర్ అంటున్నారు. చూడటానికి బక్కగా ఉన్న ఈ భవంతి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న వంటిల్లు.. మొదటి అంతస్తులో బెడ్ రూం, స్టడీ రూం.. రెండో ఫ్లోర్‌లో బాత్రూమ్, షవర్ రూం.. మూడో అంతస్తులో మాస్టర్ బెండ్ రూం ఉన్నాయి.