‘ఎఫ్‌సీయూకే’ (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్).. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్తకొత్త మార్గాలను చూపుతోంది. ఇప్పటి వరకు పాటలతోనే హడావుడి చేసిన చిత్రయూనిట్ ఇప్పుడు సరికొత్తగా ఈ చిత్ర బారసాల వేడుకను నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. జగపతిబాబు ప్రధాన పాత్రధారిగా, రామ్ కార్తీక్-అమ్ము అభిరామి యువ జంటగా, మరో కీలక పాత్రలో బేబి సహశ్రిత నటించిన చిత్రం ‘ఎఫ్‌సీయూకే’ (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్).
ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలకు ముస్తాబవుతోన్న విషయం తెలిసిందే. విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్‌పై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ (దాము) నిర్మించారు. కాగా, ఈ నెల 6న అనగా శనివారం ఈ సినిమా బారసాల వేడుక జరగనున్నది. ఈ విషయం తెలియజేస్తూ, ‘ఎఫ్‌సీయూకే బారసాల వేడుక ఫిబ్రవరి 6న’ అంటూ చిత్ర బృందం ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.
దీన్ని చూసి బారసాల వేడుక ఏమిటి!.. అంటూ అందరిలోనూ ఆశ్చర్యం, కుతూహలం వ్యక్తమవుతున్నాయి. ఆ తర్వాత ప్రి రిలీజ్ ఈవెంట్‌కే ఆ పేరు పెట్టినట్లు అర్థం చేసుకొన్నారు. ఆ రోజు ఈ సినిమా ట్రైలర్‌ను ప్రేక్షకులు చూడనున్నారు. ఇప్పటివరకూ ఈ చిత్రంలోని నాలుగు ప్రధాన పాత్రధారులకు సంబంధించిన ఫస్ట్ లుక్స్, వారి క్యారెక్టర్లను పరిచయం చేస్తూ టీజర్‌ను రిలీజ్ చేశారు. వీటన్నింటికీ మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా టీజర్‌లో జగపతిబాబు కనిపించిన తీరు అందరిలోనూ క్యూరియాసిటీని రేకెత్తించి, సినిమాపై అంచనాలను అనూహ్యంగా పెంచేసింది.
రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ సినిమాలో యంగ్ హీరోకు ఫాదర్‌గా టైటిల్ రోల్ చేసిన జగపతిబాబు క్యారెక్టర్‌లోని రొమాంటిక్ యాంగిల్, ఆ యాంగిల్‌ను ఆయన పండించిన తీరు ప్రేక్షకుల్ని అమితంగా అలరించనున్నాయి. ఫ్యామిలీ హీరోగా పేరుపొందిన ఆయన చాలా కాలం తర్వాత ఈ తరహా పాత్రను పోషించడం గమనార్హం.
అలాగే ఈ చిత్ర పాటలను కొవిడ్ టైమ్‌లో అండగా నిలబడిన వైద్య-ఆరోగ్య, మునిసిపల్, పోలీస్, మీడియా వ్యవస్థలకు చెందిన ప్రముఖుల చేతుల మీదుగా విడుదల చేసి.. చిత్రయూనిట్ హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇప్పుడు బారసాల అంటూ పేరు పెట్టడంతో.. ఇండస్ట్రీలో ఈ సినిమాపై ప్రత్యేక అటెన్షన్ కనబడుతోంది.