చెన్నై: దాదాపు ఏడాది కాలం తర్వాత భారత్‌లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగించడానికి కష్టపడుతోంది. ఈ మ్యాచులో పరుగుల వరద పారించిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ చాలా రికార్డులను తన ఖాతాలో వేసేసుకున్నాడు. తన కెరీర్‌లో 98, 99, 100వ టెస్టుల్లో వరుసగా మూడు సెంచరీలు సాధించి తాజాగా రికార్డు సృష్టించిన రూట్.. ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లో చేరాడు. ఇప్పుడు తాజాగా మరో రికార్డును తన పేరిట లిఖించికున్నాడు.
అదేంటంటే.. వరుసగా మూడు మ్యాచుల్లో 150 పైచిలుకు పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. ఈ రికార్డుతో క్రికెట్ చరిత్రలో అత్యున్నతమైన బ్యాట్స్‌మెన్లు చేరే ఎలైట్ క్లబ్‌లో స్థానం దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్‌మన్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ సరసన చేరాడు. 1937లో ఇంగ్లండ్‌పై బ్రాడ్‌మన్ అచ్చంగా ఇలాంటి ఘనతే సాధించాడు. రూట్ కన్నా ముందు ఇన్నేళ్ల క్రికెట్ చరిత్రలో కేవలం ఏడుగురు ఆటగాళ్లు మాత్రమే ఈ రికార్డును సాధించారంటే ఇది ఎంత కష్టమైన ఘనతో అర్థం చేసుకోవచ్చు.
ఇలా వరుసగా మూడు మ్యాచుల్లో 150పైగా పరుగులు సాధించిన మిగతా ఆటగాళ్లు ఎవరో తెలుసా? న్యూజిలాండ్ ఆటగాడు టామ్ లాథమ్, పాకిస్థాన్‌కు చెందిన ముదస్సార్ నజర్, జహీర్ అబ్బాస్, మరో ఇంగ్లండ్ ఆటగాడు వాలీ హమండ్, శ్రీలంక బ్యాట్స్‌మన్ కుమార్ సంగక్కర. ఇప్పటి వరకూ వీళ్లు మాత్రమే ఈ ఘనత సాధించిన జాబితాలో ఉన్నారు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టులో ఓ డబుల్ సెంచరీ, 150కి పైగా పరుగులు చేసిన రూట్.. భారత పర్యటనలోనూ చెలరేగిపోతూ ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు.
ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లుగా గుర్తింపు పొందిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, మాజీ బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఈ జాబితాలో చేరలేకపోయారు. అంతే కాదండోయ్ తన వందో టెస్టులో సెంచరీ బాదిన ఆటగాళ్ల జాబితాలో కూడా చేరిన రూట్.. ఈ లిస్టులో 9వ ఆటగాడిగా చరిత్ర పుస్తకాల్లో తన పేరు లిఖించుకున్నాడు.