ఐపీఎల్ 13వ సీజన్ ప్రేక్షకులు లేకుండా యుఏఈలో జరిగిన విషయం తెలిసిందే. కరోనా భయంతో అసలు ఈ సీజన్ ఉంటుందా, ఉండదా అనుకునే పరిస్థితుల నుంచి ఎన్నో జాగ్రత్తల మధ్య ఐపీఎల్ 13 జరిగింది. ఇక ఐపీఎల్ 14 కోసం ఇప్పటి నుంచే ఆటగాళ్లను సెట్ చేసే పనిలో టీమ్స్ నిమగ్నమై ఉన్నాయి. అయితే ఐపీఎల్ 14వ సీజన్ కోసం జరిగే మినీ ఆటగాళ్ల వేలం ఓ వారం పాటు వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 11న ఈ వేలం జరపాలని ఇంతకుముందు బీసీసీఐ నిర్ణయం తీసుకోగా.. తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 18 లేదా 19న ఈ వేలాన్ని నిర్వహించనున్నారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఐపీఎల్ పాలక మండలి తుది షెడ్యూల్‌ను విడుదల చేయనుంది.
మరోవైపు ఆటగాళ్ల వేలం జరిగే వేదిక కూడా ఇంకా ఖరారు కాలేదని తెలుస్తుంది. ఈ వేలం ప్రక్రియకు ఈసారి చెన్నైని ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే బీసీసీఐతో ఒప్పందం లేని ఆటగాళ్లు ఐపీఎల్ వేలానికి అందుబాటులో ఉండాలనుకుంటే.. ఆటగాళ్ల వేలం కాంట్రాక్ట్‌ను ఫిబ్రవరి 4లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ వేలంలో ఐపీఎల్‌కు చెందిన 8 జట్లు తమ టీమ్‌ని పటిష్టం చేసుకునేందుకు ఈ వేలంలో రూ.196.6 కోట్లు ఖర్చు చేయబోతున్నాయి. ఇప్పటికే ఆయా జట్లు రిటైన్ చేసుకునే ఆటగాళ్లు.. వేలం కోసం విడుదల చేసిన ఆటగాళ్ల పేర్లను ప్రకటించాయి.
మొత్తంగా 8 ఫ్రాంచైజీలు 139 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. అలాగే అన్ని జట్లు తమ టీమ్ నుంచి దాదాపు 57 మంది ఆటగాళ్లను తొలగించినట్లుగా తెలుస్తోంది. అంటి పెట్టుకున్న ఆటగాళ్ల కోసం.. రూ.483.39 కోట్లు ఖర్చు చేయగా.. 8 ప్రాంచైజీలు కొత్త ఆటగాళ్ల కోసం రూ.196.6 కోట్లను వేలంలో ఖర్చు చేయబోతున్నాయి. ఇక పంజాబ్ జట్టు మ్యాక్స్‌వెల్, కాట్రెల్, నీషమ్, ముజీబుర్ వంటి 9 మంది ఆటగాళ్లకు ఉద్వాసన పలుకుతుండటంతో ఈసారి ఆ జట్లు ఎక్కువ మొత్తాన్ని వేలంలో ఖర్చు చేయబోతోంది.