AP CM Jagan Mohan Reddy Press Meet: భారతదేశంలో ఎక్కడా లేని విధంగా.. పెద్ద సంఖ్యలో నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేశామని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా విద్య వైద్య రంగాల్లో నాడు–నేడుతో సమూల మార్పులు చేశామన్నారు. బుధవారం నాడు తాడేపల్లిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో నవరత్నాలు, ప్రభుత్వ పథకాల అమలుపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో పాటు అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. 30.92 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేయడం రాష్ట్ర చరిత్రలో.. బహుషా దేశ చరిత్రలో కూడా ఏనాడూ ఒక 5 ఏళ్ల వ్యవధిలో ఈ స్థాయిలో ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం జరిగి ఉండకపోవచ్చనన్నారు. కేవలం ఇళ్ల స్థలాలు మాత్రమే పంపిణీ చేయడమే కాకుండా.. హౌజింగ్ రంగంలోనే ఒక కొత్త నిర్వచనానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస యోజన (పీఎంఏవై) పథకాన్ని బహుషా మన రాష్ట్రం మాత్రమే సమర్థవంతంగా వినియోగించుకుంటుందని చెప్పవచ్చనుకుంటానని అధికారులతో సీఎం చెప్పారు. ఎందుకంటే ఆ స్థాయిలో ఇళ్ల స్థలాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని.. ఆ విధంగా ప్రతి ఒక్క చర్య గతంలో ఏనాడూ లేని విధంగా ఉన్నాయని.. ఇవన్నీ ఒక విప్లవాత్మక నిర్ణయాలు, కార్యాచరణ అని అధికారులతో జగన్ అన్నారు.
ఇదో మహత్తర పని
‘నిజం చెప్పాలంటే అలాంటి ఆలోచనలు చేయడమే ఒక మహత్తర పని. ఎందుకంటే ఏనాడూ, ఎక్కడా అలాంటి ఆలోచన ఎవరూ చేయలేదు. కానీ మన రాష్ట్రంలో కేవలం 20 నెలల వ్యవధిలోనే అన్నింటినీ సాకారం చేసి చూపాం. అది ఈ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది. అది మన ప్రభుత్వ అధికారుల సమర్థత, అంకితభావానికి ప్రతీకగా నిలుస్తోంది. అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో ఆలోచించి, కచ్చితంగా ఏదైనా చేయాలని గట్టిగా సంకల్పించి, ఆ పని చేసి చూపించింది’ అని జగన్ తెలిపారు.