ఒక్క భారతదేశమే కాదు.. ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో కుదేలైన విషయం తెలిసిందే. దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడడానికి ఇంకాస్త టైమ్ పట్టే క్రమంలో నేడు (సోమవారం) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతోన్న 2021-22 బడ్జెట్‌కు ఎంతో ప్రాధాన్యాత నెలకొంది. ఇది బాగుంది, ఇది బాగాలేదు.. అని చెప్పుకోవడానికి వీలు లేకుండా.. అన్ని వ్యవస్థలు నలిగిపోయిన క్రమంలో ఈ బడ్జెట్‌తో ఎటువంటి ఉపశమనం కలిగిస్తారు? లేదంటే ఆర్థిక వ్యవస్థను సెట్ చేయడానికి ఏమేం పన్నులు పెంచబోతున్నారు? అనే ఉత్కంఠ ప్రజలలో నెలకొంది.
ప్రజలను ఇబ్బంది పెట్టేలా కాకుండా.. తిరిగి పుంజుకునేలా చిన్న హోప్ కలిగించేలా బడ్జెట్ ఉండాలని అంతా కోరుకుంటున్నారు. కానీ దేశ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగు పడాలి కాబట్టి.. ఈసారి కూడా కొందరిపై పన్నుల భారం మరింతగా పడేలా బడ్జెట్ ఉందనే వార్తలు అప్పుడే వినిపిస్తున్నాయి. సంవత్సరంగా హెల్త్ విషయంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలిసిందే కాబట్టి.. ఈ బడ్జెట్‌లో ఆరోగ్యరంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది.
మరో వైపు కొన్ని రోజులుగా ఆందోళనలో ఉన్న రైతులను కూడా శాంతింపజేసేలా ఈ బడ్జెట్‌లో రైతులకు ప్రాముఖ్యత ఇవ్వనున్నారని తెలుస్తోంది. నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ కార్యక్రమానికి కూడా అధికంగా సొమ్ములు కేటాయించే అవకాశం ఉంది. ఒక్కటేమిటి ప్రతీ రంగం నిర్మలమ్మ ప్రవేశ పెట్టబోతోన్న బడ్జెట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఇలా ప్రతి ఒక్కరూ ఎంతో ఆశగా ఎదురచూస్తున్న క్రమంలో.. మూడో సారి బడ్జెట్ ప్రవేశ పెడుతున్న నిర్మలమ్మ లెక్కలు ఎలా ఉండనున్నాయో.. మరి కొన్ని గంటల్లో తెలిసిపోనుంది.