Friday, October 18, 2024

భారత్‌కు అనుకూలంగా అంపై‘రాంగ్’ నిర్ణయాలు.. విస్తుపోతున్న క్రీడాప్రపంచం!

Second Test Chennai: ఎక్కడైనా క్రికెట్ మ్యాచులో అద్భుతమైన క్యాచులో, భారీ సిక్సర్లో, అనూహ్యమైన బంతులో, ఉత్కంఠ విజయాలో చర్చనీయాంశాలుగా మారతాయి. కానీ భారత్ – ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో అవేమీ కాదు అంపైరింగ్ హాట్ టాపిక్‌గా మారుతోంది. అయితే ఇలా పాపులారిటీ వస్తోంది అంపైరింగ్ చాలా బావుందని కాదు.. పరమ చెత్తగా ఉందని. ఈ మ్యాచ్‌ తొలి రోజు భారత బ్యాట్స్‌మెన్ అజింక్య రహానే అవుటైనా కూడా నాటౌట్‌గా ప్రకటించడం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. అదిగో అలాంటి పొరపాటే రెండో రోజు ఆటలో కూడా రిపీట్ అయింది. ఈసారి హిట్‌మ్యాన్ రోహిత్‌ శర్మ విషయంలో అదే సీన్ రిపీట్ అవడం మరోసారి వివాదాస్పదంగా మారింది. ఈ తప్పిదాలు చూసిన ఇంగ్లండ్‌ ఆటగాళ్లే కాదు.. యావత్‌ క్రీడా ప్రపంచమే విస్తుపోతోందంటే అతిశయోక్తి కాదు.

ఫీల్డ్‌ అంపైర్‌ పొరపాటు చేస్తే సరిదిద్దాల్సిన థర్డ్‌ అంపైర్.. తనూ అదే తప్పును రిపీట్‌ చేస్తుంటే ఎలా? అని ఈ మ్యాచ్ చూసిన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు జట్టు జయాపజయాలపైనే కాదు.. పూర్తిగా అంపైరింగ్‌ వ్యవస్థపైనే నమ్మకం కోల్పోయేలా చేస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండో రోజు భారత్ రెండో ఇన్నింగ్స్‌ ఆడే సమయంలో రోహిత్‌ శర్మ ఎల్బీడబ్యూ కోసం ఇంగ్లండ్ ఆటగాళ్లు అప్పీల్ చేశారు. అది నాటౌట్ అని అంపైర్ చెప్పడంతో వెంటనే‌ రివ్యూ కోరింది. స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ వేసిన బంతి మిడిల్‌ స్టంప్‌ను తాకే దిశగా పయనిస్తున్నట్లు రీప్లేలో స్పష్టంగా కనబడుతోంది. కానీ రోహిత్‌ షాట్‌ అడే ప్రయత్నం చేశాడని చెప్పిన అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు.

రివ్యూ చూసిన థర్డ్‌ అంపైర్‌ బంతి ఆఫ్‌ స్టంప్‌ అవతలి నుంచి వెళ్తోందని, వికెట్లను మిస్ చేస్తోందని కన్ఫర్మ్‌ చేసి నాటౌట్‌గా ప్రకటించేశాడు. అయితే రోహిత్‌ ఎటువంటి షాట్‌కు ప్రయత్నించలేదని రీప్లేలో చూసిన ఎవరికైనా సులభంగా అర్థం అయిపోతుంది. అలాగే బంతి మిడిల్‌ స్టంప్‌ను తాకుతుందని కూడా సుస్పష్టంగా తెలిసి పోతుంది. థర్డ్‌ అంపైర్‌ కూడా నాటౌట్ అని ప్రకటించడంపై విస్మయానికి గురైన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్..‌ బహిరంగంగానే తన అసంతృప్తిని చూపించాడు. ఈ నిర్ణయంపై కామెంటరీ బాక్సులో ఉన్న సునీల్‌ గవాస్కర్‌ సైతం అసహనం వ్యక్తం చేశాడు. తొలి రోజు ఆటలో కూడా అంపైర్ తప్పుడు నిర్ణయంతో బతికిపోయిన రహానే.. హాఫ్ సెంచరీ చేసి భారత్‌కు మంచి స్కోరు అందించడంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. జాక్‌ లీచ్‌ వేసిన బంతి రహానే గ్లోవ్స్‌ను తాకుతూ వెళ్లి వికెట్‌కీపర్‌ చేతులకు చేరినట్లు రీప్లేలో స్పష్టమైంది. అయినా సరే థర్డ్‌ అంపైర్‌ మాత్రం రహానేను నాటౌట్‌గా ప్రకటించాడు. థర్డ్‌ అంపైర్ కేవలం‌ ఎల్బీడబ్యూ యాంగిల్‌లోనే పరిశీలించి, క్యాచ్‌ అవుట్‌ విషయాన్ని పట్టించుకోలేదు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x