చెన్నై: మైదానంలో ఎప్పుడూ అగ్రెసివ్‌గా కనిపించే టీమిండియా కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ.. సస్పెన్షన్ ప్రమాదంలో ఉన్నాడట. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టు సందర్భంగా ఆన్‌ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్‌తో కోహ్లీ తీవ్ర వాగ్వాదానికి దిగిన ఘటన గుర్తుంది కదా. అదే కోహ్లీ సస్పెన్షన్‌కు కారణమయ్యేలా ఉందని సమాచారం. ఈ టెస్టు నాలుగో ఇన్నింగ్సులో అక్షర్ పటేల్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఈ దురదృష్టకర ఘటన జరిగింది. అక్షర్ విసిరిన బంతి నేరుగా వికెట్ల పైకి వచ్చింది. దీన్ని గమనించిన ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ దానిని ఆడేందుకు ట్రై చేశాడు. అయితే బంతి అతడి ప్యాడ్‌ను తాకింది. ప్యాడ్‌ను తాకి వచ్చిన బంతిని క్యాచ్ పట్టిన వికెట్ కీపర్ రిషభ్ పంత్.. అవుట్‌కు అప్పీల్ చేశాడు. దీనిపై స్పందించని అంపైర్ నితిన్ మీనన్.. రూట్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. దీనిపై కొహ్లీ రివ్యూకు వెళ్లాడు. రీప్లేలో బంతి రూట్ ప్యాడ్‌కు తాకిందని స్పష్టంగా కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ ఎల్బీడబ్ల్యూ కోణంలోనూ చెక్ చేశాడు.
బంతి వికెట్లను తాకుతున్నా కూడా.. అది పిచ్ పడిన చోటు అంపైర్స్ కాల్ అని థర్డ్ అంపైర్ వెల్లడించాడు. దీంతో దీన్ని నాటౌట్‌గా ప్రకటించారు. దీంతో కోహ్లీకి చిర్రెత్తింది. సరాసరి అంపైర్ నితిన్ మీనన్ వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. అంపైర్ సర్ది చెబుతున్నా వినలేదు. ఆయనతో వాదిస్తూనే అసహనం వ్యక్తం చేశాడు. కోహ్లీ ప్రవర్తించిన తీరును కొందరు మాజీ క్రికెటర్లు కూడా తప్పు బట్టారు. కోహ్లీ అలా ప్రవర్తించడం ఏమీ బాగలేదని, అలా చేయకుండా ఉండాల్సిందని అంటున్నారు.
ఇదిలా ఉంటే కోహ్లీ చేసిన పనిని ఐసీసీ నిబంధనల ప్రకారం, లెవెల్ 1 లేదా లెవెల్ 2 తప్పిదంగా పరిగణించే అవకాశం ఉందిట. ఇలాంటి తప్పులు చేసిన ఆటగాడికి ఒకటి నుంచి నాలుగు డీ-మెరిట్ పాయింట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కోహ్లీ విషయంలో అదే నిర్ణయం తీసుకుంటే మాత్రం ప్రమాదమే. ఎందుకంటే కోహ్లీపై ఇప్పటికే రెండు డీ మెరిట్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే పాయింట్లు కూడా కలుపుకుంటే.. మొత్తమ్మీద ఓ టెస్టు మ్యాచ్ నిషేధం పడే అవకాశం కనిపిస్తోంది. మరి దీనిపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.