జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయాల్లోకి రావాలంటూ చాలా రోజులుగా అటు ఏపీలో.. ఇటు తెలంగాణలో పెద్ద హాట్ టాపికే జరుగుతోంది. అయితే ఆయన ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా..? ఎప్పుడు పగ్గాలు చేపడుతారా..? అని వేయికళ్లతో వీరాభిమానులు, టీడీపీ కార్యకర్తలు వేచి చూస్తున్నారు. జూనియర్ మాత్రం ఇంకా వెనకడుగేస్తూనే ఉన్నాడు. ఆయన అసలు రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందా..? లేదా అన్నది క్లారిటీ లేదు. ఈ మధ్య పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో మరోసారి జూనియర్ పేరు గట్టిగానే వినిపించింది. ‘రావాలి జూనియర్… కావాలి ఎన్టీఆర్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వాస్తవానికి ప్రస్తుతం టీడీపీ పెను కష్టాల్లోనే ఉంది. ఇప్పటికిప్పుడు జూనియర్ వచ్చినా పార్టీ బలోపేతం అయ్యే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయని విశ్లేషకులు, నిపుణులు చెబుతున్నారు.
అయితే.. అసలు ఆయన మనసులో ఏముంది..? రాజకీయాల్లోకి వస్తారా.. రారా..? అనే విషయాలను తాజాగా ప్రెస్‌మీట్‌లో క్లారిటీ ఇచ్చేశాడు. జెమినీ టీవీలో త్వరలో ప్రసారం కాబోతున్న సరికొత్త షో ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’. ఈ షోకు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రెస్‌మీట్‌లో భాగంగా రిపోర్టర్లతో ముచ్చటించగా.. రాజకీయాలు ప్రస్తావన వచ్చింది. పొలిటికట్ ఎంట్రీ ఎప్పుడుంటుంది..? అని మీడియా మిత్రులు ప్రశ్నించారు. ఇందుకు జూనియర్ తనదైన శైలిలో బదులిచ్చారు. ‘ ఈ ప్రశ్నకు సమాధానం మీరే చెప్పాలి. చాలా కార్యక్రమాల్లో దీనికి నేను సమాధానం చెప్పాను. పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్నించేందుకు ఇది సమయం కాదు.. సందర్భం కూడా అంతకంటే కాదు. తర్వాత తీరిగ్గా, మంచిగా వేడివేడి కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం’ అని ఎన్టీఆర్ బదులిచ్చాడు.
మొత్తానికి చూస్తే.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఉంటుందనే విషయాన్ని పై సమాధానాన్ని బట్టి చూస్తే పరోక్షంగా జూనియర్ చెప్పకనే చెప్పేశారనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. రాజకీయాల్లోకి రావాలని ఎన్టీఆర్ మనసులో అయితే ఉందన్నది దీన్ని బట్టి చూస్తే వాస్తవమే అని తెలుస్తోంది. సో.. ఇది అభిమానులు, టీడీపీ కార్యకర్తలకు కాసింత చిన్నపాటి శుభవార్తే అని చెప్పుకోవచ్చు.