Friday, October 18, 2024

జగన్-షర్మిల మధ్య విభేదాలు నిజమే.. భారతీకి కూడా!

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా వైఎస్ ఫ్యామిలీ గురించే చర్చించుకుంటున్నారు. అందుకు కారణం వైఎస్ ఫ్యామిలీలో విబేధాలు వచ్చాయని.. అందుకే వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీని స్థాపించబోతున్నారని. గత కొన్నిరోజులుగా కొత్త పార్టీపై వార్తలు వస్తుండటం.. మంగళవారం నాడు అభిమానులు, అనుచరులు, వైఎస్ ఫ్యామిలీని అభిమానించే నేతలతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తుండటంతో ఈ వార్తలకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

అసలు మంగళవారం నాడు జగనన్న వదిలిన బాణం ఏం చేయబోతున్నారు..? కొత్త పార్టీ ప్రకటిస్తారా..? వైసీపీనే తెలంగాణలో కొనసాగిస్తారా..? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి తరుణంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, వైఎస్ ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడు, వైఎస్సార్‌కు సన్నిహితుడిగా పేరుగాంచిన గోనే ప్రకాశ్ ఉన్నట్టుండి బాంబు పేల్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

విభేదాలు నిజమే..!
‘జగన్, షర్మిల మధ్య విభేదాలు ఉన్న మాట నిజమే. 2018 క్రిస్మస్ వరకే షర్మిల పులివెందుల వెళ్లారు. జగన్ సీఎం అయ్యాక వెళ్లలేదు. 2019లో జగన్ కుటుంబం మొత్తం పులివెందులకు వెళ్లినా, షర్మిల మాత్రం వెళ్లలేదు. నాటి నుంచీ షర్మిల బెంగళూరులోనే ఉన్నారు. షర్మిల కొత్త పార్టీ పెడతారని నాలుగు, ఐదు నెలల క్రితమే నేను చెప్పాను. షర్మిల, బ్రదర్ అనిల్ ఇద్దరూ కొత్త పార్టీ ఏర్పాటుపై కసరత్తు చేశారు. ‘గూడు కదులుతోంది’ అని షర్మిల భర్త అనిల్ సోషల్ మీడియాలో ఇటీవల చేసిన పోస్టు కొత్త పార్టీ గురించే.

జగన్ జైల్లో ఉన్నప్పుడు ఉపఎన్నికల కోసం షర్మిల ఎంతో కష్టపడ్డారు. 2014 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేయాలని అడిగిన వెంటనే షర్మిల ఒప్పుకున్నారు. ఒకట్రెండు కాదు ఏకంగా 3 వేల కిలోమీటర్లకు పైగా షర్మిల పాదయాత్ర చేశారు. ఉపఎన్నికల్లో విజయాలకు 99 శాతం షర్మిలే కారణం. 2019 ఎన్నికల్లో లోక్‌సభ సీటు ఇస్తానని షర్మిలకు జగన్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పారు. చివరకు ఏదీ ఇవ్వలేదు. ఇలా చాలా విషయాలల్లో ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది’ అని గోనే సంచలన వ్యాఖ్యలు చేశారు.

భారతీకి కూడా రాజకీయ ఆకాంక్ష..!
అంతటితో ఆగని ఆయన.. జగన్ సీఎం అయిన తర్వాత ఒక్కసారి కూడా బెంగళూరు నుంచి షర్మిల గుంటూరుకు వెళ్లలేదని చెప్పుకొచ్చారు. బ్రదర్అనిల్ కూడా మూడు రోజులు అక్కడ ఉన్నప్పుడు ఏం జరిగిందనేది తెలుసన్నారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు రోడ్లపై పడి తిరిగితే, చివరకు తమను బాధలకు గురిచేశారంటూ వైయస్ కుటుంబ సభ్యులు అనుకుంటున్నారని కడపకు చెందిన కొందరు వీఐపీలు మాట్లాడుకుంటున్నారని ప్రకాష్ చెప్పడం గమనార్హం. అంతేకాదు చివరగా.. వైఎస్ జగన్ సతీమణి గురించి గోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ భార్య భారతికి కూడా రాజకీయ ఆకాంక్ష ఉందని ఆయన చెప్పడాన్ని బట్టి చూస్తే పరిస్థితులు ఎలా మారిపోతాయో అర్థం కావట్లేదు.

వాస్తవానికి జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఫ్యామిలీ మొత్తం కలిసింది కానీ.. ఆ తర్వాత ఏ సందర్భంలోనూ అంతా కలవలేదు. మొత్తానికి చూస్తే.. గోనే వ్యాఖ్యల్లో ఒకటి అర అచ్చు తప్పులు అనిపించినా.. కొన్ని మాత్రం అక్షరాలా నిజమనిపిస్తున్నాయ్. ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడు కావడంతో ఈయన మాటలే నిజమని అందరూ అనుకుంటున్నారు. మరి మంగళవారం జరిగే ఆత్మీయ సమ్మేళనంలో షర్మిల ఏం ప్రకటన చేస్తారో..? ఆ ప్రకటన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి..? అనేది ఊహకు కూడా అందట్లేదు. ఫైనల్‌గా ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడక తప్పదు మరి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x