Friday, October 18, 2024

విమానం ఎక్కిన పిల్లి.. పైలట్‌ను వణికించేసింది!

ముద్దు ముద్దుగా ‘మ్యావ్.. మ్యావ్..’ అంటూ మన కాళ్ల చుట్టూ తిరిగే పిల్లి పిల్లలు అంటే ఎవరికైనా ఇష్టమే. అయితే ఈ పిల్లి పిల్లలు అప్పుడప్పుడూ మనల్ని ముప్పు తిప్పలు పెడుతుంటాయి. ఇదిగో ఈ పిల్లి కూడా అలాంటిదే. ఇదైతే ఏకంగా ఓ విమానం మొత్తాన్ని హడలెత్తించింది. దీని ధాటికి ఓడిపోయిన పైలెట్.. విమానాన్ని వెంటనే ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఆఫ్రికా దేశం సూడాన్ తెలుసు కదా. దాని రాజధాని ఖార్టూమ్ నుంచి ఖతర్‌కు ఓ విమానం బయలు దేరింది. అయితే అది అలా గాల్లోకి లేచిన కాసేపటికే పైలెట్ వణికిపోయాడు. ఎందుకంటే ఆ విమానం కాక్‌పిట్‌లో ఓ పిల్లి ఉంది. అయితే ఆ పైలెట్‌కు పిల్లులంటే భయమేం లేదు. వెంటనే దాన్ని పట్టేద్దామని అనుకున్నాడు. ఆ తర్వాత అర్థమైంది అతనికి ఆ పిల్లిని పట్టుకోవడం తాను అనుకున్నంత ఈజీ కాదని. అతని చర్యలు గమనించిన ఆ పిల్లి పైలెట్‌పై దాడికి దిగింది. ఎంత సేపు ప్రయత్నించినా దాన్ని బంధించడం సాధ్యం కాలేదు. దీంతో ఆ పైలెట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసేశాడు.

టార్కో ఏవియేషన్‌కు చెందిన ఈ విమానం బుధవారం నాడు సుడాన్ నుంచి ఖతర్ వైపు ప్రయాణం ప్రారంభించింది. టేకాఫ్ అయిన అరగంట తరువాత విమాన సిబ్బందికి కాక్‌పిట్‌లో ఓ పిల్లి కనిపించింది. దాన్ని పట్టుకోవడానికి విమాన సిబ్బంది ప్రయత్నించారు. కానీ ఆ పని చేయడం వారి వల్ల కాలేదు. ఇక ఆ పిల్లిని బంధించడం తమ వల్ల కాదని డిసైడ్ అయిపోయిన పైలెట్ విమానాన్ని మళ్లీ వెనక్కు తిప్పి ఖార్టూన్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. అంతకు ముందు రోజు రాత్రి విమానం.. ఎయిర్‌పోర్ట్‌లో ఉండగా ఈ పిల్లి విమానంలో ఎక్కేసి ఉంటుందని అక్కడి అధికారులు భావిస్తున్నారు. విమానాన్ని శుభ్రం చేయాల్సి ఉండటంతో ఆ రోజు దాన్ని ఆ విమానాశ్రయంలో ఉంచారు. అప్పుడే ఈ పిల్లి విమానం ఎక్కేసిందన్నమాట.

అయితే.. పిల్లికి విమానం కొత్త ప్రదేశం కావడంతో అది భయపడిపోయిందని, అందుకే పైలెట్‌పై దాడి చేసి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై టార్కో ఏవియేషన్ నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు. వినడానికి వింతగా ఉన్నా ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి. గతేడాది గోఎయిర్ విమానంలోకి రెండు పావురాళ్లు ప్రవేశించి కలకలం రేపాయి. అహ్మదాబాద్ నుంచి జైపూర్ వెళ్లే విమానంలో ఈ ఘటన జరిగింది. దీని వల్ల గోఎయిర్ విమానం ప్రయాణం అరగంట ఆలస్యం అయింది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x