ఓడలు సముద్రంలో వెళ్తాయని మనకు కచ్చితంగా తెలుసు. అయితే ఎప్పుడైనా గాల్లో తేలుతున్న ఓడను చూశారా? ఈ ప్రశ్న ఎవరైనా అడిగితే అడిగిన వాళ్లకు మతిస్థిమితం ఉందా? అని మనకు డౌట్ రావడం సహజం. కానీ ఇలాంటి ఘటన నిజంగానే జరిగింది. కాకపోతే ఇక్కడ కూడా ఓడ నిజంగా గాల్లో ఎగర్లేదు లెండి. ఆ విషయంలోనే ఇక్కడ ఓ మాయ జరిగింది. అదేంటో తెలియాలంటే అసలు విషయంలోకి వెళ్లి పోవాల్సిందే.
అది ఇంగ్లండ్‌లోని కార్న్‌వాల్ ప్రాంతం. హెల్‌స్టన్‌లోని గిలియన్ ప్రాంతం నుంచి సముద్రంలోకి చూస్తున్నాడు డేవిడ్ మోరిస్ అనే వ్యక్తి. అప్పుడే అతనికి దిమ్మతిరిగి పోయే ఘటన కనిపించింది. అదేంటంటే.. అతను చూస్తున్న సముద్రంలో దూరంగా ఒక ఓడ గాల్లో తేలుతూ నెమ్మదిగా ముందుకు సాగిపోతోంది. అది చూసిన డేవిడ్‌కు కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపించింది. వెంటనే ఆ వింత దృశ్యాన్ని కెమెరాలో బంధించాడు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తే విపరీతంగా వైరల్ అయిపోయింది. పైన నీలి రంగు ఆకాశం, కింద నీలి రంగు సముద్రం మధ్యలో గాల్లో రెంటికీ సంబంధం లేనట్లు ఎరుపు, తెలుపు రంగులతో ఉన్న ఓడ. ఇదీ అతని కెమెరాలో చిక్కిన దృశ్యం. అయితే ఇక్కడ ఓడ నిజంగా గాల్లో తేలడం లేదని నిపుణులు వివరించారు. ఇలాంటి ఘటనలను రియల్ లైఫ్ ఆప్టికల్ ఇల్లూజన్లు అంటారని వెల్లడించారు. అంటే అక్కడ ఉన్న విషయం వేరు, మనకు కనిపిస్తున్న చిత్రం వేరు అయిందన్నమాట. ఇంతకీ ఈ ఓడ గాల్లో తేలుతున్నట్లు ఎందుకు కనిపిస్తుందో తెలుసా? మేఘాల వల్ల అని కొందరు అంటున్నారు. భూమికి చాలా దగ్గరగా ఉండే మేఘాలు ఆ ప్రాంతంలో సముద్రం నీటి రంగును మార్చేసి ఉండొచ్చని, దీంతో మనకు ఓడ గాల్లో తేలుతున్నట్లు కనిపిస్తోందని కొందరు చెప్తున్నారు.
కొందరేమో ఆ మేఘాలు ఓడ కింది భాగాన్ని కప్పేసి ఉండొచ్చని వాళ్లు చెప్తున్నారు. మరికొందరేమో సదరు ఓడ ఉన్న ప్రాంతంలో అసలు మేఘాలే లేకపోవడంతో ఆకాశం, సముద్రాన్ని ప్రతిబింబించి ఉండొచ్చని అంటున్నారు. అలా జరిగినా కూడా మనకు పడవ గాల్లో తేలుతున్నట్లే కనిపిస్తుందట. ఇక్కడ ఏం జరిగిందో కచ్చితంగా అయితే చెప్పలేం కానీ, జరిగింది చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.