Friday, April 4, 2025

ఉగాది రోజు వాలంటీర్లను సత్కరిద్దాం : జగన్

Honor to AP volunteers: వైసీపీ అధికారంలోకి రాగానే వాలంటీర్ల వ్యవస్థను అమల్లోకి తెచ్చామని.. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించిన విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు. అంతేకాకుండా ఈ మధ్య వారిలో కొందరు వేతనాల పెంపు కోరుతూ రోడ్డెక్కిన విషయం తన దృష్టికి వచ్చిన విషయాన్ని కూడా సమీక్షలో అధికారులతో జగన్ పంచుకున్నారు. నిజంగా వాళ్లంతా అలా రోడ్లెక్కడం చూసి తనకు చాలా బాధ కలిగిందన్నారు.

‘‘నిజానికి గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల నియామకం, ఆయా వ్యవస్థలను మనం ఎందుకు ఏర్పాటు చేశాం? ప్రజలకు మెరుగైన సేవలందించడం కోసమే కదా?. గతంలో మనందరికీ తెలుసు. ప్రజల కోసం పంపిస్తున్న ప్రతి రూపాయిలో చివరకు లబ్ధిదారులకు 40 పైసల కంటే తక్కువే అందుతోందని. అదే విధంగా అర్హులైన లబ్ధిదారుల సంఖ్యను కూడా ఎక్కువ చేసి చూపే వారు. అందుకే అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకం అందాలని, అనర్హులైన వారిలో ఏ ఒక్కరికి కూడా సహాయం అందవద్దన్న సంకల్పంతోనే వాలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేశాం’ అని జగన్ తెలిపారు.

వాలంటీర్లకు సత్కారం..
‘‘వాలంటీర్‌ అంటేనే స్వచ్ఛందంగా పని చేసే వారని అర్ధం. కానీ దానర్థం మార్చేసి, ప్రభుత్వం నుంచి ఇంకా ఆశించడం, మొత్తం వ్యవస్థనే నీరు గారుస్తుంది. కాబట్టి మరో మార్గంలో వాలంటీర్లను ప్రోత్సహించాల్సి (మోటివేట్‌) ఉంది. ఆ ప్రక్రియలో నాకు ఇవాళే ఒక ఆలోచన వచ్చింది. ఉగాది పండగ రోజు నుంచి ప్రతి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో వాలంటీర్ల సత్కారం. వారికి సేవా రత్న, సేవా మిత్ర వంటి బిరుదులు. అలా చేయడం వల్ల వాలంటీర్ల సేవలను గుర్తించినట్లు అవుతుంది. వారిని ప్రోత్సహించినట్లు అవుతుంది. కాబట్టి ఉగాది రోజున ఈ కార్యక్రమం మొదలు పెట్టి, ప్రతి నియోజకవర్గంలో ఒక్కో రోజున వాలంటీర్లను సత్కరించాలి.

ఉదాహరణకు మా సొంత జిల్లా కడపలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే అది 10 రోజుల కార్యక్రమం. అలా తూర్పు గోదావరి జిల్లాలో అయితే 19 రోజులు, గుంటూరు జిల్లాలో 17 రోజుల పాటు వాలంటీర్ల సత్కార కార్యక్రమం కొనసాగుతుంది. వాటిలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, గ్రామ సచివాలయాల బాధ్యతలు నిర్వర్తిస్తున్న జాయింట్‌ కలెక్టర్, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. వాలంటీర్లకు రివార్డుతో కూడిన అవార్డులు ఇవ్వాలి. ఆ విధంగా చేయడం వల్ల, వాలంటీర్ల సేవలను గుర్తిస్తూ సేవా రత్న, సేవా మిత్ర వంటి బిరుదులు ఇవ్వడం వల్ల వారిని ఎంతో ప్రోత్సహించినట్లు అవుతుంది. అప్పుడు వారు తమ బాధ్యతలను కేవలం ఒక ఉద్యోగంగా భావించకుండా, సేవా దృక్పథంతో పని చేస్తారు’’ అని జగన్ తెలిపారు.

ఇది ఒక మోటివేషన్‌..
‘‘ఏటా ప్రతి ఉగాది పర్వదినం రోజున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తే, వాలంటీర్లను ఎంతో ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుంది. అంతే కాకుండా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలులో అవినీతి, వివక్ష, ఆశ్రిత పక్షపాతానికి పూర్తిగా ఫుల్‌స్టాప్‌ పెట్టినట్లు అవుతుంది. ఇంకా వాలంటీర్లు మహోన్నతమైన సేవలందిస్తున్నారన్న భావన కూడా అందరిలో కలిగించినట్లు అవుతుంది. కాబట్టి వచ్చే ఉగాది నుంచి ఆ కార్యక్రమం మొదలు పెట్టేలా కార్యాచరణ సిద్ధం చేయండి.

గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల మధ్య పూర్తి సమన్వయం ఉంటే ప్రభుత్వ పథకాలు మరింత వేగంగా, సమర్థంగా ప్రజలకు అందుతాయి. అయితే ఇంతకు ముందు చెప్పినట్లు మొత్తం ఈ వ్యవస్థను మనం ‘ఓన్‌’ చేసుకోకపోతే, అది సాధ్యం కాదు. అందువల్ల మీలో ప్రతి ఒక్కరూ ఈ వ్యవస్థను తమదిగా భావించాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను.

ప్రజల నుంచి వచ్చే వినతులు, సంబంధిత విభాగాలకు వెళ్లేలా చూడడం, వాటి సత్వం పరిష్కారంపై దృష్టి పెట్టడం జరగాలి’ అని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Most Voted
Newest Oldest
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x