Ravichandran Ashwin: సొంత గడ్డపై టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ క్రమంలో తొలి టెస్టులోలాగే తన పేరిట పలు రికార్డులు రాసేసుకున్నాడు. అశ్విన్ తన టెస్టు కెరీర్‌లో 5 వికెట్లు తీయడం ఇది 29వ సారి. స్వదేశంలో ఈ ఫీట్ సాధించడం 23వ సారి. అశ్విన్ స్వదేశంలో 45 టెస్టులు ఆడాడు. వాటిలో 23 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఇలా స్వదేశంలో అత్యధిక సార్లు 5 వికెట్ల ఫీట్ అందుకున్న బౌలర్ల జాబితాలో అశ్విన్ కంటే ముందు శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (45 సార్లు), రంగన హెరాత్ (26 సార్లు), టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (25 సార్లు) ఉన్నారు. ఇక ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ స్వదేశంలో 89 టెస్టులాడి 22 సార్లు 5 వికెట్ల ఫీట్ సాధించాడు.
రెండో టెస్టులో అశ్విన్ రికార్డుల పరంపర ఇక్కడితో ఆగలేదు. మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అదేంటో తెలుసా? టెస్టు క్రికెట్‌లో 200 మంది ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేసిన తొలి బౌలర్‌గా అశ్విన్ రికార్డు సృష్టించాడు. అశ్విన్ బంతికి ఎక్కువగా బురిడీ కొట్టిన వారి జాబితాలో టాప్ బ్యాట్స్‌మెన్ చాలా మందే ఉన్నారు. ఆసీస్ డ్యాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 10 సార్లు, అలిస్టర్ కుక్, స్టోక్స్ 9 సార్లు, జేమ్స్ అండర్సన్, ఎడ్ కొవాన్ 7 సార్లు అశ్విన్ స్పిన్ మాయకు అడ్డంగా బుక్కయ్యారు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఐదు వికెట్లు తీసిన అశ్విన్.. టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను అధిగమించాడు. స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో లెగ్ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే అగ్రస్థానంలో ఉన్నాడు.
స్వదేశంలో 45 టెస్టులాడిన అశ్విన్ 268 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 23 సార్లు 5 వికెట్లు, 6 సార్లు పది వికెట్ల ఫీట్స్ సాధించాడు. ఈ జాబితాలో తొలి స్థానంలోని కుంబ్లే 62 టెస్టుల్లో 350 వికెట్లు కూల్చాడు. ఇందులో 25 సార్లు 5 వికెట్లు, 7 సార్లు 10 వికెట్ల ఫీట్స్ అందుకున్నాడు. మొత్తంగా చూసుకుంటే అశ్విన్ ఇప్పటి వరకు టీమిండియా తరపున 77 టెస్టుల్లో 396 వికెట్లు, 111 వన్డేల్లో 150 వికెట్లు, 46 టీ20ల్లో 52 వికెట్లు పడగొట్టి భారత అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా నిలిచాడు.