Rakshita Brother Raana: ప్రస్తుతం స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ తన తమ్ముడు అమన్‌ని హీరోగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె బాటలోనే మరో సీనియర్ నటి నడుస్తోంది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇడియట్’ చిత్రంతో తెలుగువాళ్లకి పరిచయమైన రక్షిత.. ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల చిత్రాలలో నటించి మంచి నటిగా గుర్తింపు పొందింది. ఇప్పుడామె తన తమ్ముడు రానాని హీరోగా పరిచయం చేస్తుంది.
‘‘ఏక్ లవ్ యా’’ అనే టైటిల్‌తో తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి రక్షిత భర్త, కన్నడ స్టార్ డైరెక్టర్ జోగి ప్రేమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. జోగి ప్రేమ్ గురించి చెప్పాలంటే కన్నడలో శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్, దర్శన్, సుదీప్ వంటి స్టార్ హీరోలను ఆయన డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు తన బావమరిదిని డైరెక్ట్ చేస్తున్నాడు.
ఈ చిత్రం గురించి తెలుపుతూ.. విడుదల చేసిన రానా లుక్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. దర్శనమే సిక్స్ ప్యాక్ బాడీతో ఇవ్వడంతో.. అందరూ ఈ హీరోయిన్ తమ్ముడిపై ఓ కన్నేశారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14, ఆదివారం ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్‌ను చిత్రయూనిట్ విడుదల చేయబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చిత్రయూనిట్ అంటోంది. ఈ చిత్రంలో రానా సరసన రీష్మ, రచితా రామ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అర్జున్ జాన్య సంగీతాన్ని అందిస్తున్నారు.