టోక్యో: సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ఓ మహిళా బైకర్ గురించి షాకింగ్ నిజం బయటపడింది. జపాన్‌కు చెందిన ఈ యువ మోటార్ బైక్ రైడర్ అసలు అమ్మాయే కాదట. ఆమె 50 ఏళ్ల మగాడట! బైక్ ముందు నిల్చుని ఇటీవల ‘ఆమె’ తీసుకున్న ఫొటో కొంతమంది అభిమానులకు అనుమానం తెప్పించింది. అంతే వాళ్లు దాన్ని బాగా సీరియస్‌గా తీసుకొని రకరకాల పరీక్షలు చేశారు. దీంతో ఆమె ‘ఆమె’ కాదని, ‘అతను’ అని తేలింది.
బైక్ రియర్ వ్యూ మిర్రర్‌లో కనిపించిన ఆమె ప్రతిబింబం ‘అతడిని’ పట్టించింది. ఈ ఫొటో కాస్తా వైరల్ అవడంతో జపాన్ మీడియా అవుట్‌లెట్లు అన్నీ కదిలాయి. ఆ బైకర్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని డిసైడ్ అయ్యాయి. ఒక జపాన్ వెరైటీ షో సిబ్బంది నానా కష్టాలూ పడి ఈ బైకర్‌ను పట్టుకున్నారు. ఆమె నిజానికి 50 ఏళ్ల పురుషుడన్న విషయం వెల్లడి కావడంతో సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్లకు దిమ్మతిరిగిపోయింది.
విషయం బయటపడడంతో అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో అతగాడు వివరించాడు. సోషల్ మీడియాలో ‘అంకుల్’గా ఉండాలని ఎవరూ అనుకోరని, అందుకే తన ఫొటోను ఇలా అమ్మాయిగా మార్చేశానని తెలిపాడు. సరదా కోసమే అలా చేశాను తప్పితే ఇందులో మరో ఉద్దేశం ఏదీ లేదని వివరణ ఇచ్చుకున్నాడు.
తాను మహిళగా ఫొటో పెట్టిన వెంటనే 1000 మంది ఫాలోవర్లు వచ్చారని, దీంతో దానిని అలాగే కొనసాగించాలని అనుకున్నానని, ఆన్‌లైన్ సెలబ్రిటీగా ఫీలయ్యానని చెప్పుకొచ్చాడు. తాను అమ్మాయిలా కనపడేందుకు ఫేస్‌యాప్, ఫొటోషాప్‌లను ఉపయోగించినట్లు ఈ బైకర్ వివరించాడు.