న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో ప్రపంచం మొత్తం చర్చించుకుంటున్న ప్రధాన సమస్య కరోనా. కరోనా టీకాలు, స్ట్రెయిన్‌ల గురించే అందరూ చర్చించుకుంటున్నారు. అలాంటి కరోనా గురించి బాత్ యూనివర్శిటీకి చెందిన గణిత శాస్త్రవేత్త కిట్ యేల్స్ ఓ సరికొత్త విషయం వెల్లడించారు. ఆయన మదిలో అనుకోకుండా ఈ కొత్త ఆలోచన మెదిలిందిట. అదేంటో తెలుసా?
అసలు ప్రపంచంలో ఉన్న కరోనా వైరస్ కణాలన్నిటీని ఓ దగ్గరకు చేరిస్తే అవి ఎంత స్థలం ఆక్రమిస్తాయి..? ఇదే కిట్ మనసులో మెదిలిన డౌట్. ఇలాంటి ప్రశ్న మనకు వచ్చిందనుకో.. కాసేపే దానిపై పిచ్చాపాటీ మాట్లాడుకొని వదిలేస్తాం. కానీ కిట్ ఓ శాస్త్రవేత్త కదా! అది కూడా గణిత శాస్త్రంలో భయంకరమైన టాలెంట్ ఉన్న వ్యక్తి. అందుకే తన తెలివి తేటలన్నీ ఉపయోగించి.. ఏవో కొన్ని సమీకరణాలు, లెక్కలూ అన్నీ వేసేసి ఓ అంచనాకు వచ్చేశారు.
ఇన్ని లెక్కలు వేసిన తర్వాత ఆయన లెక్కల్లో ఓ ఆసక్తికర విషయం బయట పడింది. ప్రపంచంలో అప్పటికప్పుడు ఈ క్షణాన ఉనికిలో ఉన్న కరోనా వైరస్ కణాలు మొత్తం ఓ దగ్గరకు చేర్చామంటే.. అవి చాలా సులువుగా 330 మిల్లీ లీటర్ల కోకా కోలా క్యాన్‌లో సరిపోతాయట. ఈ వైరస్ కణాలన్నింటినీ ఓ చోటకు చేర్చిన తర్వాత కూడా ఆ క్యాన్‌లో కొంత ఖాళీ ప్లేస్ మిగిలిపోతుందని కిట్ వెల్లడించారు. ఈ విషయం వింటే ఒక్కో వైరస్ కణం ఎంత సైజులో ఉంటుందో తెలియడం లేదూ? బంతి రూపంలో ఉండే కరోనా వైరస్ ఘన పరిమాణం (వాల్యూమ్), ప్రపంచంలో ప్రతిరోజు సగటున ఎన్ని కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి, వ్యక్తుల శరీరాల్లో వైరస్ కణాల సంఖ్య ఎంత ఉంటుంది అనే అంశాలు అన్నింటినీ ఓ అంచనా వేసిన కిట్ ఈ లెక్క గట్టారట.
‘పోయిన ప్రాణాలు, చిన్నాభిన్నమైన జీవితాలు, గత ఏడాదిలో మనం అనుభవించిన కష్ట నష్టాలు అన్నిటికీ ఈ చిన్న జీవే కారణమని తెలిస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుందో కదూ’ అని ఆయన వ్యాఖ్యానించారు. మీక్కూడా అలాగే అనిపిస్తోంది కదూ..! ఇక కిట్ లెక్కల ప్రకారం, ప్రపంచంలో ఏ క్షణంలో అయినా సరే దాదాపు 20 వేల కోట్ల వైరస్ కణాలు ఉనికిలో ఉంటాయట! ఈ కరోనా లెక్క భలేగా ఉంది కదా!